హైదరాబాద్‌ను దాటి ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను రాష్ట్ర బ్యూరోక్రసీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైల్ క్లియరెన్స్‌లో నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి పర్యటనల లేమి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అన్ని శాఖల సెక్రటరీలు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారుచేయాలని సీఎం చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావును ఆదేశించారు.
దీంతో గత మూడు నాలుగు రోజులుగా చీఫ్ సెక్రటరీ ప్రతి శాఖ సెక్రటరీతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నెల రోజుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో దాదాపు 30 మంది సెక్రటరీలు ఉన్నప్పటికీ, నెల రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయికి వెళ్లిన వారు కేవలం ముగ్గురే అని అధికారులు గుర్తించారు.
ఫీల్డ్ విజిట్‌కు వెళ్లిన వారిలో అగ్రికల్చర్ సెక్రటరీ సురేందర్ మోహన్, లేబర్ శాఖ సెక్రటరీ దానా కిషోర్, మేడారం జాతర పనుల పర్యవేక్షణ కోసం స్పెషల్ సీఎస్ సభ్యసాచి ఘోష్ మాత్రమే ఉన్నట్టు తెలిసింది. మిగిలిన సెక్రటరీలు హైదరాబాద్‌ను దాటి బయటకు వెళ్లలేదన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలను అద్దె భవనాల నుంచి ప్రభుత్వ భవనాలకు మార్చాలన్న సీఎం ఆదేశాలకూ పెద్దగా స్పందన లేదని సమాచారం. ఏటా కోట్ల రూపాయలు అద్దెకు ఖర్చవుతున్నప్పటికీ, శాఖల కార్యాలయాలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి తరలించేందుకు అధికారులు చొరవ చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రత్యేక నివేదిక కూడా సిద్ధమయ్యిందని తెలుస్తోంది.
ఫైళ్ల పెండింగ్ మరో పెద్ద సమస్యగా మారింది. కొందరు సెక్రటరీలు ఆలస్యంగా కార్యాలయాలకు రావడం, వచ్చినా ఫైళ్లపై దృష్టి పెట్టకపోవడం వల్ల వందలాది ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫైల్ క్లియరెన్స్‌లో ఆలస్యం వెనుక అవినీతి కోణం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ప్రతి శాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఏ ఫైల్ ఎక్కడ, ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉందన్నది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మొత్తానికి, మంత్రులు పని చేసినా కిందస్థాయి అధికారులు స్పందించని పరిస్థితి ఉందన్న విమర్శలు సచివాలయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. సీఎం విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ నివేదికలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

