బీజేపీ జాతీయ అధ్యక్షుడు తొలిసారి తెలంగాణకు వస్తున్న సందర్భంలో రాష్ట్ర వాస్తవ పరిస్థితులపై స్పష్టత అవసరమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయే వారు కాదని, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను వారు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగలేదని, లౌకిక విలువలకే కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
తెలంగాణ నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందన్న ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తోందని ఆరోపించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టులు ఇప్పటికీ మంజూరు కాలేదని పేర్కొంది.
బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు వంటి కీలక అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించింది. తెలంగాణ ‘రైజింగ్ 2047’ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తుంటే, కేంద్రం మాత్రం పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదని ఆరోపించింది.
ఇటీవలి కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ మండిపడింది. రోడ్లు, మెట్రో రైలు, మూసీ ప్రాజెక్టు వంటి కీలక అంశాలను విస్మరించారని పేర్కొంది. బయోఫార్మా, సెమీకండక్టర్, టూరిజం రంగాలకు కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించింది.
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.01 శాతం కాగా, ఆ మేరకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం కోతలు విధిస్తోందని ఆరోపించారు. జీఎస్టీ ద్వారా తెలంగాణ భారీగా చెల్లిస్తున్నప్పటికీ తిరిగి వచ్చే నిధుల్లో అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని హెచ్చరించారు.
తెలంగాణలో బీసీలు 56 శాతం పైగా ఉన్నారని, వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను గవర్నర్ ఆమోదించకపోవడంపై బీజేపీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కోతలు పెట్టడం ద్వారా పేదలపై భారాన్ని మోపుతున్నారని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల వేళ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, సోదర భావంతో మెలిగేవారని, బీజేపీ రాజకీయాలకు లొంగరని గత ఎన్నికలే నిరూపించాయని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, అదే దిశగా ప్రజలు ఓటు వేయాలని కోరారు.

