ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశాన్ని ప్రపంచ స్థాయి శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కీలక ప్రతిపాదనలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే జాతీయ స్థాయి ఏఐ వార్ రూమ్‌ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఢిల్లీ లో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పరిశోధనలకు దోహదపడే ప్రత్యేక ఏఐ యూనివర్సిటీ అవసరమని సూచించారు. దేశవ్యాప్తంగా ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత అంశాలను సమన్వయం చేయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో రాష్ట్రంలో ఏఐ స్టార్టప్ విలేజ్, రీస్కిల్లింగ్–అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను రోల్ మోడల్‌గా నిలబెట్టే లక్ష్యంతో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ప్రజలకు చేరవేస్తామని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రతిపాదనలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని అధికారిక వెబ్సైట్లు హ్యాకింగ్ సమస్యలు, భద్రత లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రతిపక్ష వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముందుగా ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేసి, సైబర్ భద్రతను మెరుగుపరిచిన తర్వాతే భారీ ఏఐ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని వారు అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రభుత్వ వెబ్సైట్ల నిర్వహణ, భద్రత, సేవల అందుబాటు వంటి అంశాలను ముందుగా సరిచేయాలని విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక టెక్నాలజీ రంగ అభివృద్ధి అవసరమని ఒకవైపు ప్రభుత్వం చెబుతుండగా, ప్రాథమిక డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం కీలకమని మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఐ అభివృద్ధి ప్రణాళికలు, సైబర్ భద్రత సవాళ్లు – ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

