తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం సిట్ విచారణకు హాజరైన అనంతరం మాట్లాడిన ఆయన, ఈ కేసు విచారణ ద్వారా పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆరోపించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని తెలిపారు.
శివకుమార్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఉద్దేశం న్యాయం చేయడం కాదని, రాజకీయ కాలయాపన కోసం ఉపయోగిస్తున్న అంశంగా మారిందని విమర్శించారు. ఎన్నికల సమయాల్లో ఈ కేసును మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు.
అలాగే ఈ మొత్తం వ్యవహారంలో నిజంగా ఇబ్బందులు పడుతున్నది అధికారులు మాత్రమేనని అన్నారు. రాజకీయ నాయకులు తమ స్వలాభాల కోసం, ఎన్నికల వ్యూహాల కోసం అధికారులను బలిపశువులుగా మారుస్తున్నారని విమర్శించారు. ఏ చిన్న తప్పు జరిగినా బాధ్యత మొత్తం అధికారులపై నెట్టివేస్తున్నారని, కానీ రాజకీయ నాయకులు మాత్రం ఎప్పుడూ సురక్షితంగానే బయటపడుతున్నారని అన్నారు.
అధికారులకు నిజంగా స్వేచ్ఛ ఇస్తే, చట్టం ప్రకారం పని చేయనిస్తే ఎవరు తప్పు చేసినా విచారణ జరుగుతుంది. అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై కూడా చర్యలు తీసుకునే ధైర్యం అధికారులు చూపగలరు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు” అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తెలంగాణలో అధికార యంత్రాంగం పూర్తిగా రాజకీయ ఒత్తిడిలో పనిచేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ ఏం చెప్తే అదే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, నిజాయితీగా పనిచేసే కొంతమంది సీనియర్ అధికారులను కూడా ఒత్తిళ్ల ద్వారా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా అసలు దర్యాప్తు కంటే రాజకీయ ప్రచారం ఎక్కువగా కనిపిస్తోందని ఆయన అన్నారు. “ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీష్ రావును విచారిస్తారా? అంటూ చర్చలు తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ చివరికి ఇది కాలయాపనకే పరిమితమవుతోంది” అని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు అరెస్టులు, విచారణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివకుమార్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

