రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది” – బీఆర్ఎస్ విమర్శలు

తెలంగాణలో రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా బలహీనపరుస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించింది.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొంటూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటల విద్యుత్ సరిపోతుందనే దిశగా రైతులను తీసుకెళ్తోందని విమర్శించింది. రైతు కమిషన్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.

రైతు బంధు పథకం అమలులో కూడా ప్రభుత్వం వెనుకబడిందని, ఎన్నికల తర్వాత ఐదు విడతలు రావాల్సి ఉండగా మూడు విడతల నిధులు విడుదల చేయలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. సుమారు రూ.30 వేల కోట్ల మేర రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది.

రైతు బీమా పథకం కూడా నిలిచిపోయిందని, ఎల్ఐసీకి ప్రీమియం చెల్లింపులు ఆలస్యం కావడంతో వేలాది మంది రైతు కుటుంబాలు బీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయని విమర్శించింది.

కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు నిధులను సమయానికి విడుదల చేసిందని గుర్తు చేసింది. మంత్రుల జీతాలు, కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేసినా రైతు బంధు మాత్రం ఆపలేదని పేర్కొంది.

రుణమాఫీ హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని, ఎన్నికల హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందని ఆరోపించింది. ఎరువుల కొరత, విద్యుత్ సమస్యలు, పంటల కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

పంటల కొనుగోలు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకే పరిమితం అవుతోందని బీఆర్ఎస్ విమర్శించింది. కేంద్రం కొనుగోలు చేసే పంటలనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం రైతులకు నష్టదాయకమని పేర్కొంది.

కేసీఆర్ హయాంలో కేంద్రం కొనుగోలు చేయకపోయినా మక్కలు, జొన్నలు, సోయాబీన్, పెసర్లు, శనగలు, కందులు వంటి పంటలను రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిందని గుర్తు చేసింది.

అలాగే 2021–22లో బీఆర్ఎస్ ప్రభుత్వం 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలునే గొప్పగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించింది.

రైతు బంధు బకాయిలు, పూర్తి రుణమాఫీ, రైతు బీమా, పంటల కొనుగోలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గ్రామాల్లో రైతులతో ఈ అంశాలపై చర్చించి ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *