డెలివరీ బాయ్‌తో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు అఖిల్ దుత్యమారి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, పూర్తి విషయాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం బాధాకరమని అన్నారు.
అఖిల్ తెలిపిన వివరాల ప్రకారం, కొండాపూర్‌లోని తమ నివాసానికి పొరపాటున ఒక డెలివరీ బాయ్ పార్సెల్ అందజేశాడు. అసలు ఆ పార్సెల్ ఎదురుగా ఉన్న మరో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు ఇవ్వాల్సి ఉండగా, తమ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పారు. పార్సెల్‌పై “Opposite to Aruna Residency” అని స్పష్టంగా రాసి ఉన్నప్పటికీ, ఎలాంటి నిర్ధారణ చేయకుండా తమ ఇంట్లోనే ఇచ్చి వెళ్లిపోయాడని పేర్కొన్నారు.
ఇంట్లో ఎవరో ఆర్డర్ చేసి ఉంటారని భావించి తన తండ్రి పార్సెల్ తీసుకున్నారని, అనంతరం ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలుసుకుని కవర్‌ను తెరిచి చూసినట్లు తెలిపారు. సుమారు 20 నిమిషాల తర్వాత డెలివరీ బాయ్ తిరిగి రావడంతో పార్సెల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచామని చెప్పారు.
ఆ సమయంలో తాను ఒక బాధ్యతగల పౌరుడిగా డెలివరీ బాయ్‌ను అడ్రస్‌ను ఎందుకు సరిచూసుకోలేదని ప్రశ్నించానని అఖిల్ తెలిపారు. అయితే అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు తన తల్లితో కూడా అనుచితంగా మాట్లాడాడని ఆరోపించారు. “ఫ్రీగా వస్తే తీసుకుంటారా?” అంటూ అసభ్యకరంగా మాట్లాడడంతో కుటుంబ సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు తాను స్పందించాల్సి వచ్చిందన్నారు.
తాను డెలివరీ బాయ్‌ను కొట్టేందుకు వెళ్లలేదని, కేవలం అతని ప్రవర్తనను ప్రశ్నించానని అఖిల్ స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో కూడా తన తండ్రి తనను వెనక్కి ఆపేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తాయని చెప్పారు. డెలివరీ బాయ్ ముందుగా వీడియో తీయడం ప్రారంభించడంతో తమ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారని వివరించారు.
తాను కూడా ఒకప్పుడు డెలివరీ ఉద్యోగాలు చేసి జీవితంలో ఎదిగానని, డెలివరీ సిబ్బంది కష్టాలు తనకు బాగా తెలుసని అఖిల్ అన్నారు. తమ ఇంటికి వచ్చే డెలివరీ సిబ్బందికి మజ్జిగ, పండ్లు ఇచ్చి పంపించేంత గౌరవం తమ కుటుంబానికి ఉందని చెప్పారు. అలాంటి తాము ఎలాంటి కారణం లేకుండా డెలివరీ బాయ్‌ను అవమానించే అవసరం లేదన్నారు.
తన వల్ల తప్పు జరిగి ఉంటే క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని, అయితే తన తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని మాత్రం సహించలేక స్పందించానని చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
అంతేకాకుండా ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయని అఖిల్ పేర్కొన్నారు. పూర్తి ఆధారాలు పరిశీలించకుండా సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేయడం, తన కుటుంబాన్ని దూషించడం మానుకోవాలని ప్రజలను, మీడియాను కోరారు.
ఈ వివాదంపై వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు ఎవరూ ఏకపక్షంగా తీర్పులు ఇవ్వొద్దని అఖిల్ దుత్యమారి విజ్ఞప్తి చేశారు.

