తెలంగాణలో యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న యాప్ ఆధారిత విధానం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే ప్రక్రియ వల్ల సమయానికి ఎరువు అందడం లేదని, గతంలో ఉన్న డీలర్ ఆధారిత పంపిణీ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రైతుల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, రైతులు యూరియా కోసం ఇంతగా ఇబ్బందులు పడిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వారు పేర్కొన్నారు.
గతంలో రైతులు నేరుగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దకు వెళ్లి ఆధార్ కార్డు చూపించి తమకు అవసరమైన యూరియా కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేదని తెలిపారు. అయితే ప్రస్తుతం యాప్లో బుకింగ్ చేసేలోపే స్టాక్ అయిపోతుండటంతో చాలా మంది రైతులకు యూరియా అందడం లేదని ఆరోపించారు.
గ్రామీణ ప్రాంతాల్లో చదువు తెలియని రైతులు యాప్ వినియోగించేందుకు ఇతరుల సహాయం తీసుకునేలోపే స్టాక్ ముగిసిపోతుందని, ఒక కేంద్రంలో లేకపోతే మరో కేంద్రానికి తిరగాల్సి వస్తోందని రైతులు వాపోయారు. చివరకు యూరియా సంచులు దొరికినా వాటిని తరలించేందుకు అదనంగా రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోందని తెలిపారు.
రాష్ట్రంలోని దాదాపు 80 శాతం మంది రైతులకు ఇప్పటికీ అవసరమైన యూరియా అందలేదని రైతులు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో డీలర్ల ద్వారా ఎకరాల ఆధారంగా రైతులకు ఎరువులు అందిస్తున్నప్పుడు తెలంగాణలో మాత్రమే యాప్ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.
ఇప్పటికే ఎరువుల ధరలు భారీగా పెరిగాయని రైతులు గుర్తు చేశారు. డీఏపీ, పొటాష్, సూపర్ ఫాస్ఫేట్ వంటి ఎరువుల ధరలు పెరగడంతో సాగు వ్యయం మరింత అధికమైందని తెలిపారు. మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, గత రబీ సీజన్లో కూడా తీవ్ర నష్టాలు ఎదురుకావడం వల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో యూరియా కొరత రైతుల ఆందోళనను మరింత పెంచుతోందని, వెంటనే యాప్ విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగా డీలర్ల ద్వారా నేరుగా యూరియా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక రైతుకు ఎంత భూమి ఉంటే అంత మేరకు అవసరమైన యూరియాను ఒకేసారి అందించే విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల సమస్యలను అర్థం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులు మరింత ఇబ్బందులు పడకముందే పాత పంపిణీ విధానాన్ని పునరుద్ధరించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

