కార్మిక శాఖలో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ (DIMS) పరిధిలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందన్న ప్రచారం కార్మిక శాఖ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విభాగం ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కొనసాగుతుండగా అక్కడ అవసరమయ్యే మందులు, ఇంజెక్షన్లు, ఆపరేషన్ థియేటర్ పరికరాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
టెండర్ ప్రక్రియలో కీలక అధికారులు నేరుగా జోక్యం చేసుకుని తమకు అనుకూలమైన ఏజెన్సీలకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు పెద్దఎత్తున అధికారులకు కమిషన్లు చెల్లిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇతర ఏజెన్సీలకు పనులు దక్కినా, బిల్లులు విడుదల చేసే సమయంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కావాల్సిన ‘పర్సెంటేజ్’ ఇచ్చిన తర్వాతే బిల్లులు క్లియర్ అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరు అధికారులు మధ్యవర్తుల ద్వారా వసూళ్లు నిర్వహిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. కొత్త ఏజెన్సీలు రంగంలోకి రావడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికే ఉన్న కొంతమంది కాంట్రాక్టర్లే అధికారులతో కుమ్మక్కై వ్యవస్థను నడుపుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. “ముందు అధికారులు ‘నో’ అంటారు.. తర్వాత అందరూ సర్దుకుపోతారు” అని శాఖలో రిటైర్ అయిన ఓ అధికారి వ్యాఖ్యానించినట్లు సమాచారం.
మందుల కొనుగోళ్ల నుంచి ఆపరేషన్ థియేటర్ పరికరాల వరకు ప్రతి కొనుగోలులోనూ పెద్ద అధికారులకు వాటాలు వెళ్లాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోలు విలువ ఎంతైనా సరే 10 నుంచి 20 శాతం వరకు కమిషన్లు అధికారుల జేబుల్లోకే వెళ్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం కోసం ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు మరింత తీవ్రతరమవుతున్నాయి.
ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థ కూడా విస్తరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు నేరుగా అధికారులను కలవలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రతి పనికీ మధ్యవర్తులే కీలకంగా మారుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనన, మరణ ధ్రువపత్రాలు వంటి సాధారణ సేవలకూ ఏజెంట్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవినీతి ఆరోపణలపై ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు అవినీతి నిరోధక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మరోవైపు ప్రభుత్వ శాఖల్లో అక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

