కాంగ్రెస్‌లో అసంతృప్తి పెరుగుతోందా? సీఎం రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందనే చర్చకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పని చేసిన సీనియర్ నాయకులకు గౌరవం దక్కడం లేదని, ప్రస్తుతం పార్టీలో కొత్తగా చేరిన వారిదే హవా నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం “షో ఆఫ్ ప్రభుత్వం” నడుస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో ఒంటెద్దు పోకడలు కనిపిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా కష్టపడిన అసలు కాంగ్రెస్ నాయకులు రోజురోజుకూ కనుమరుగవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల విషయంలో తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని మునుగోడు తన నియోజకవర్గమని, స్థానిక ఎమ్మెల్యేగా తనను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ప్రశ్నించారు.

ఇటీవల నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభకు తాను ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదని కూడా ఆయన వెల్లడించారు. పార్టీలో సీనియర్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని, కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌లో ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గతంలో జీవన్ రెడ్డి వంటి నాయకులు కూడా పార్టీ వ్యవహార శైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చకు దారితీశాయి.

అయితే మరోవైపు పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం వల్లే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తి నేతలతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దుతుందా, లేక అంతర్గత విభేదాలు మరింత ముదురుతాయా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *