బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు ముందస్తు బెయిల్ విషయంలో తాత్కాలిక ఊరట లభించలేదు. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ అనంతరం తీర్పును గురువారానికి వాయిదా వేసింది.
ఈ కేసులో రాత్రి 9 గంటల నుంచి 11:40 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగినట్లు సమాచారం. భగీరథ తరఫు న్యాయవాదులు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరగా, పోలీసులు మాత్రం విచారణకు సహకరించడం లేదని కోర్టుకు వివరించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే విచారణకు హాజరవుతానని చెప్పిన భగీరథ ఇంకా ముందుకు రాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణ వ్యక్తి అయితే వెంటనే కఠిన చర్యలు తీసుకునేవారని, కానీ రాజకీయ నాయకుడి కుమారుడు కావడంతో సడలింపులు ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో కేసును రాజకీయంగా కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలకు వేదికగా మార్చుకున్నారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలు, వాటిపై రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
మరోవైపు గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచులకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేసే ప్రతిపాదనపై కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతోంది. సర్పంచ్-ఉపసర్పంచ్ మధ్య విభేదాలు, నిధుల వినియోగంలో జాప్యం వంటి సమస్యల నేపథ్యంలో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిని బీఆర్ఎస్ రాజకీయ అంశంగా మలచే అవకాశముందని అధికార వర్గాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

