గోల్డ్ క్వెస్ట్ నుంచి ఇగ్నైట్ వరకు.. పేర్లు మారినా మోసం ఒక్కటే! క్యూనెట్‌పై హైదరాబాద్ పోలీసుల సంచలన వివరాలు

పేర్లు మారుతున్నాయి.. కానీ మోసం మాత్రం అదే పద్ధతిలో కొనసాగుతోందని హైదరాబాద్ పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్్‌నెట్, క్యూనెట్, తాజాగా ఇగ్నైట్ ఇండీ కనెక్ట్ వెంచర్స్ పేర్లతో ప్రజలను మోసం చేస్తున్న ఒకే నెట్‌వర్క్‌పై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు.

పోలీసుల ప్రకారం, మొదట గోల్డ్ క్వెస్ట్ పేరుతో ప్రారంభమైన ఈ వ్యాపారం, కేసులు నమోదవడంతో క్వెస్ట్్‌నెట్, తర్వాత క్యూనెట్ (వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), ఇప్పుడు ఇగ్నైట్ ఇండీ కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త అవతారంలో కొనసాగుతోంది.

2004లో క్వెస్ట్్‌నెట్ కంపెనీ నమోదు కాగా, 2010లో కేంద్ర ప్రభుత్వం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) ద్వారా దర్యాప్తుకు ఆదేశించింది. 2012లో సమర్పించిన నివేదికలో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని, దేశ భద్రతకు కూడా ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ సంస్థల ప్రధాన వ్యాపార విధానం సభ్యత్వాల ద్వారా కొత్త వ్యక్తులను చేర్చుకోవడమేనని, ఇద్దరిని లేదా ముగ్గురిని చేర్చితే డబ్బులు వస్తాయని చెప్పి ప్రజలను ఆకర్షిస్తున్నారని పోలీసులు తెలిపారు. దీనిని డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్, రెఫరల్ మార్కెటింగ్ వంటి పేర్లతో ప్రచారం చేసినప్పటికీ, వాస్తవానికి ఇది అక్రమ మనీ సర్క్యులేషన్ పిరమిడ్ స్కీమ్ అని స్పష్టం చేశారు.

ఇలాంటి పథకాలలో చేరిన వారిలో 93 నుంచి 94 శాతం మంది డబ్బులు కోల్పోతారని, పిరమిడ్ పైభాగంలో ఉన్న కొద్ది మంది మాత్రమే లాభపడతారని దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఆ లాభాలు కూడా విదేశాల్లో ఉన్న నిర్వాహకులకే చేరుతున్నాయని చెప్పారు.

ఇటీవల నమోదైన మూడు కేసుల దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, కోల్‌కతా రాష్ట్రాల్లో ఆరుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. గతంలో క్యూనెట్‌కు సంబంధించిన కేసుల్లో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు కోర్టులో కొందరికి శిక్షలు కూడా విధించబడ్డాయి.

క్రిప్టోకరెన్సీ, హవాలా మార్గాల ద్వారా భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరుగుతున్న అనుమానాలు ఉన్నాయని, ఈ అంశంపై ఈడీ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందజేస్తామని అధికారులు వెల్లడించారు.

“ఎక్కడ సభ్యులను చేర్చితే డబ్బులు వస్తాయని చెబుతారో, ఎక్కడ ఎన్రోల్మెంట్ ఆధారంగా ఆదాయం వస్తుందో అలాంటి స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పేర్లు మారినా మోసం మారదు” అని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *