తెలంగాణలో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడులు.. ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడులు.. ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్: తెలంగాణలో చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇటీవల వికారాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రతను గాలికొదిలేసిందని ఆరోపించారు.

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో సెల్‌ఫోన్ చార్జర్ తీసుకురావడానికి వెళ్లిన ఓ బాలికపై అత్యాచారం జరిగిందని, బొమ్మరాజపేట మండలంలో మైనర్ బాలికపై కుటుంబ సభ్యుడే లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. అలాగే బషీరాబాద్ మండలం జీవంగి గ్రామంలో మరో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందని, మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ మైనర్ బాలికపై దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. నిర్మల్ జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని కూడా ప్రస్తావించారు.

ఈ ఘటనలన్నీ ఒకే నెలలో చోటుచేసుకోవడం రాష్ట్రంలో చిన్నారుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు.

2024 సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 2,200 పోక్సో కేసులు నమోదయ్యాయని, 2025లో కూడా కేసుల సంఖ్య తగ్గకుండా మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఇవి తాము చెబుతున్న లెక్కలు కాదని, అధికారిక గణాంకాలు మరియు ఎన్సీఆర్బీ డేటా ప్రకారమే ఈ పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక ఉమెన్ వింగ్, షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, ప్రతి జిల్లాలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ వ్యవస్థలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మహిళా భద్రత బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారులకు ఇతర కీలక బాధ్యతలు అప్పగించడం వల్ల ఫోకస్ దెబ్బతిందని, ఫలితంగా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కరీంనగర్‌లో బంగారు దుకాణంపై జరిగిన దోపిడీ, హైదరాబాద్‌లో అదనపు డీజీపీ వినయ్ కుమార్ ఇంట్లో జరిగిన హత్య, జూబ్లీహిల్స్ ఘటన, ఖమ్మంలో సెల్‌ఫోన్ దుకాణంపై అంతర్రాష్ట్ర దొంగల దాడి వంటి కేసుల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో పురోగతి లేదని విమర్శించారు.

ఇక ఖమ్మం జిల్లాకు చెందిన చిన్నారి ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబం అత్యంత పేదదని, తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. మొదట ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స అందలేదని, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చు చేశారని పేర్కొన్నారు. పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ కూడా మందులు బయట కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆరోపించారు.

బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు చూపించిన బిల్లుల ప్రకారం రూ.3,900, రూ.2,350, రూ.730 విలువైన మందులను బయట కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. దాతలు ఫోన్‌పే ద్వారా పంపిన డబ్బుతోనే మందులు కొనుగోలు చేశామని చిన్నారి తల్లి తమతో ఆవేదన వ్యక్తం చేసిందని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద కుటుంబానికి కనీస వైద్య సహాయం కూడా అందించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంలో బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనను వెలుగులోకి తీసుకువచ్చిన రజక సంఘం జిల్లా అధ్యక్షుడు ముతిగొండ రాంబాబును పోలీసులు బెదిరించారనే ఆరోపణలు కూడా చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి కేసు నమోదు చేయించేందుకు సహకరించిన వ్యక్తిపై కేసులు పెడతామని హెచ్చరించడం అమానుషమని పేర్కొన్నారు. సంబంధిత పోలీసు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధిత చిన్నారికి వెంటనే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. చిన్నారి పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. చిన్నారికి అవసరమైన శస్త్రచికిత్సలు ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్వహించి అత్యున్నత స్థాయి వైద్యం అందించాలని కోరారు.

అలాగే నిందితులపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠినాతికఠిన శిక్షలు విధించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, చిన్నారి పూర్తిగా కోలుకునే వరకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *