హైదరాబాద్/సిద్దిపేట: సిద్దిపేట జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల మహా శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని బీజేపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న పలు అంశాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారాలపై నాయకులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ఈ నెల 25 నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని బీజేపీ అభిప్రాయపడింది. ఎస్‌ఐఆర్‌ను రాజకీయ కోణంలో చూపిస్తూ పాలక, ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీపై, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వయంగా న్యాయవాది కావడంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన చట్టపరమైన అంశాలను స్పష్టంగా ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఓటరు జాబితాల ప్రక్షాళన, నవీకరణ కోసం నిర్వహించే ప్రక్రియే ఎస్‌ఐఆర్ అని, ఏ వర్గానికి చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు తొలగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం లేదని స్పష్టం చేశారు.
ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా బీజేపీ కర్తవ్యమని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను మీడియా కూడా బాధ్యతాయుతంగా పరిశీలించాలని కోరారు. “నిజం బయటకు వచ్చేలోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది” అన్నట్టుగా, దేశంలో ఎప్పుడూ జరగని ప్రక్రియను ఇప్పుడు మొదటిసారి తీసుకొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అన్ని రాజకీయ పార్టీలకు బీఎల్‌ఏల నియామకానికి అవకాశం కల్పించినప్పటికీ, కావాలనే అపోహలు సృష్టిస్తూ ఒక వర్గం ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోందన్న దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో చివరిసారిగా 2002లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నిర్వహించబడిందని, దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ఓటరు జాబితాల సమగ్ర ప్రక్షాళన కోసం ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాల ఖచ్చితత్వం అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హ పేర్లను గుర్తించడం ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మారుస్తుందని బీజేపీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రజలు సహకరించాలని పార్టీ పిలుపునిచ్చింది.

