హైదరాబాద్: ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వేల కోట్ల రూపాయల మనీ సర్క్యులేషన్ కుంభకోణానికి తెరలేపేందుకు ప్రయత్నించిన అంతర్జాతీయ మోసగాళ్ల ముఠాను హైదరాబాద్ సిటీ పోలీసులు బట్టబయలు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన క్యూనెట్ సంస్థ, ఈసారి “ఇగ్నైట్” పేరుతో కొత్త అవతారం ఎత్తి మరో భారీ మోసానికి పునాదులు వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం 18 రోజుల్లోనే ఈ నెట్‌వర్క్‌ను గుర్తించిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు, సుమారు రూ.5,000 కోట్ల మేర జరిగే అవకాశం ఉన్న భారీ మోసాన్ని అడ్డుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు.
ఆపరేషన్ ‘ఇగ్నైట్ క్రాక్‌డౌన్’
ఈ కేసులో భాగంగా “ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్” పేరిట కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిలో ఓనియల్ గుప్తా (టీమ్ లీడర్), దినేష్ కుమార్, ప్రియాంశు సక్సేనా, ప్రవీణ్ కుమార్, పరితోష్ కుమార్ (డైరెక్టర్లు), రియాజ్ (ఫీల్డ్ రిక్రూటర్) ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితుల ఫిర్యాదులతో వెలుగులోకి..
ఈ నెట్‌వర్క్‌లో చేరేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.1.87 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ముగ్గురు బాధితులు హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం సీసీఎస్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది.
గతంలో వేల కోట్ల రూపాయల క్యూనెట్ మోసాలకు పాల్పడిన నిర్వాహకులే ఇప్పుడు “ఇగ్నైట్” పేరుతో మరోసారి రంగంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారు.
డమ్మీ కంపెనీల ద్వారా డబ్బుల మళ్లింపు
పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును నేరుగా సంస్థ ఖాతాలకు కాకుండా, కోల్‌కతాకు చెందిన డమ్మీ కంపెనీల ఖాతాల్లో జమ చేయించినట్లు తేలింది. అక్కడి నుంచి హవాలా, క్రిప్టోకరెన్సీ మార్గాల ద్వారా హాంకాంగ్‌కు నిధులను తరలించినట్లు ఆధారాలు లభించాయి.
ఇగ్నైట్ సంస్థ ప్రధాన కార్యకలాపాలు హాంకాంగ్ నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.60 వేల టూత్ బ్రష్.. చైన్ మార్కెటింగ్ మాయాజాలం
సాధారణంగా మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లను సుమారు రూ.60 వేల వరకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, “ఇద్దరిని కొత్తగా సభ్యులుగా చేర్చితే మీరు పెట్టిన డబ్బు తిరిగి వస్తుంది” అంటూ ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్లు గుర్తించారు.
ఒకరు మరో ఇద్దరిని, వారు ఇంకో ఇద్దరిని చేర్చే విధంగా నెట్‌వర్క్‌ను విస్తరించి, కమిషన్ల పేరుతో మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది.
ప్రజలకు హెచ్చరిక
చైన్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ పథకాల పేరుతో భారీ లాభాలు వస్తాయని చెప్పే సంస్థల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. “చిన్న పెట్టుబడితో భారీ ఆదాయం”, “కొత్త సభ్యులను చేర్చితే రెట్టింపు లాభాలు” వంటి వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించే కంటే, ముందుగానే జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచించారు.
ఇంటర్‌పోల్ సహకారంతో దర్యాప్తు
పరారీలో ఉన్న అంతర్జాతీయ కింగ్‌పిన్‌లను పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రజల అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకుని మోసాలకు పాల్పడే ఇలాంటి చైన్ మార్కెటింగ్ సంస్థల పట్ల అప్రమత్తతే రక్షణ అని అధికారులు స్పష్టం చేశారు.

