న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించగా, మరోవైపు బీజేపీ అభ్యర్థులు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.
మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో నమోదైన కేసుల వివరాలను నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించలేదంటూ బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం ఈ మొత్తం వ్యవహారంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్‌కు కూడా తెలియని కేసు వివరాలు చివరి నిమిషంలో బీజేపీ నేతలకు ఎలా చేరాయన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. గాంధీభవన్‌లోని నాయకత్వానికి, పార్టీ వర్గాలకు కూడా తెలియని అంశం ప్రత్యర్థి పార్టీ నేతల వద్దకు చేరడం వెనుక రాజకీయ కోణం ఉందా అనే చర్చ జరుగుతోంది.
నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైనప్పుడే ఈ అంశాన్ని ప్రస్తావించకుండా, చివరి నిమిషంలోనే బయటకు తీసుకురావడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇది కేవలం చట్టపరమైన అంశమా? లేక బీజేపీ అభ్యర్థుల ఎన్నికను సులభతరం చేసేందుకు ముందుగానే రచించిన రాజకీయ వ్యూహమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఈ వ్యవహారంపై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్గాల నుంచే ఈ సమాచారం లీక్ అయిందా? లేక అంతర్గత విభేదాల ఫలితంగా ఈ పరిణామం చోటుచేసుకుందా? అనే చర్చ సాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు బయటకు రాలేదు.
ఈ వ్యవహారంపై ఒక బీజేపీ మంత్రి చేసిన సోషల్ మీడియా వ్యాఖ్య కూడా రాజకీయంగా దుమారం రేపుతోంది. “ముందు మీ ఇల్లు చూసుకోండి.. మీ పార్టీలోని వారే మాకు సమాచారం ఇచ్చారు” అనే తరహాలో చేసిన వ్యాఖ్యలు మరింత అనుమానాలకు కారణమయ్యాయి.
మీనాక్షి నటరాజన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఆమెపై ఉన్న కేసుల్లో కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోలేదని, అవి కేవలం ప్రీ-కాగ్నిజెన్స్ దశలో ఉన్నాయని, అలాంటి వివరాలను నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొనాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. ఇలాంటి స్పష్టమైన తప్పులు జరిగినప్పుడు ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని తెలిపారు.
ఈ నేపథ్యంలో పిటిషన్‌పై విచారణ జరిపేందుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చంద్రకర్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ విచారణ ఫలితం రాజకీయంగా కీలకంగా మారింది.
ఇదే సమయంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్, రాజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే గుజరాత్ నుంచి నలుగురు, రాజస్థాన్ నుంచి ముగ్గురు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ నుంచి చెరో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్‌డీఏ మద్దతు ఉన్న మేఘాలయలో ఒక అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడులో ఉపఎన్నిక జరిగిన స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, మన్సూర్ అలీ ఖాన్, పవన్ ఖేరా, బీజేపీకి చెందిన నాగరాజు రాజ్యసభకు వెళ్లనున్నారు.
జూన్ 18న జార్ఖండ్‌లో రెండు స్థానాలు, మిజోరాంలో ఒక స్థానం, మహారాష్ట్ర, ఒడిశాల్లో చెరో ఉపఎన్నిక జరగనుంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రజల మదిని తొలిచే ప్రధాన ప్రశ్న మాత్రం ఒకటే. మీనాక్షి నటరాజన్ నామినేషన్ చివరి నిమిషంలోనే ఎందుకు వివాదాస్పదమైంది? ఆ కేసు వివరాలు బీజేపీ నేతలకు ఎలా చేరాయి? ఇది సహజ రాజకీయ పరిణామమా? లేక ముందే రచించిన వ్యూహంలో భాగమా?
ఈ ప్రశ్నలకు సమాధానం సుప్రీంకోర్టు విచారణలో లభిస్తుందా? లేక ఈ వివాదం మరింత రాజకీయ దుమారానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.

