గ్రహిణుల శ్రమ అమూల్యం.. నెలకు రూ.30 వేలకు పైగానే విలువ: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

దేశంలోని కోట్లాది మంది గృహిణుల శ్రమకు గౌరవం దక్కేలా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇంటి పనులు చేసే మహిళలు కేవలం కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవిస్తున్నారనే సామాజిక భావన పూర్తిగా తప్పని స్పష్టం చేస్తూ, గృహిణుల సేవలకు ఆర్థిక విలువ ఉందని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది.

ఒక కుటుంబం సజావుగా నడవడంలో గృహిణి పాత్ర అమూల్యమని పేర్కొన్న సుప్రీంకోర్టు, ప్రమాదవశాత్తు ఒక గృహిణి మరణిస్తే ఆమె అందించే సేవలను ద్రవ్య రూపంలో కనీసం నెలకు రూ.30 వేలుగా పరిగణించాలని కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణులను కేవలం ఇల్లకే పరిమితమైన వారిగా కాకుండా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులుగా గుర్తించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ చారిత్రాత్మక తీర్పు వెనుక దాదాపు 25 ఏళ్ల న్యాయ పోరాటం ఉంది. పంజాబ్‌కు చెందిన ఓ గృహిణి 2001లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణంతో భర్త, ముగ్గురు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు తగిన నష్టపరిహారం అందించాలని వారు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

మొదట ట్రిబ్యునల్ బాధిత కుటుంబానికి రూ.2.42 లక్షల పరిహారం మంజూరు చేసింది. ఆ మొత్తం సరిపోదని భావించిన కుటుంబ సభ్యులు పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించగా, పరిహారాన్ని రూ.8.43 లక్షలకు పెంచింది. అయినప్పటికీ గృహిణిగా ఆమె కుటుంబానికి అందించిన సేవలకు ఇది సరిపడని పరిహారమని భావించిన బాధితులు చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటిశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో గృహిణుల శ్రమను తక్కువగా అంచనా వేసే ధోరణిని తీవ్రంగా తప్పుబట్టింది.

“గృహిణులు సంపాదించే భర్తలపై ఆధారపడి జీవిస్తున్నారనడం సరైంది కాదు. వాస్తవానికి ఒక ఇల్లు ప్రశాంతంగా, క్రమబద్ధంగా నడవడానికి గృహిణి చేసే సేవలే మూలాధారం” అని ధర్మాసనం పేర్కొంది.

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, పిల్లల సంరక్షణ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం, ఇంటి నిర్వహణ వంటి అనేక బాధ్యతలను ఒక గృహిణి నిర్వర్తిస్తుందని కోర్టు గుర్తుచేసింది. ఇవన్నీ మార్కెట్‌లో వేర్వేరు వ్యక్తులు చేస్తే భారీ ఖర్చు అవుతుందని, కానీ గృహిణులు ఎలాంటి జీతం ఆశించకుండా ఈ సేవలను అందిస్తున్నారని పేర్కొంది.

పలు అధ్యయనాల ప్రకారం మహిళలు చేసే వేతనం లేని గృహ సేవలు దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 15 నుంచి 17 శాతం వరకు విలువ కలిగి ఉంటాయని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. అందుకే గృహిణుల సేవలను ఆర్థికంగా కొలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు, ఒక వంటమనిషి, క్లీనర్, పిల్లలను చూసుకునే సంరక్షకురాలు, ఇంటి నిర్వహణ చూసే మేనేజర్ వంటి అనేక పాత్రలను ఒక గృహిణి ఒంటరిగా పోషిస్తుందని పేర్కొంది. అందువల్ల ఆమె సేవలను తక్కువ చేసి చూడలేమని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, గృహిణి మరణంతో కుటుంబం కోల్పోయే సేవలను కనీసం నెలకు రూ.30 వేలుగా పరిగణించి నష్టపరిహారం నిర్ణయించాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రమాణాల ఆధారంగా బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించాలని స్పష్టం చేసింది.

డబ్బు సంపాదిస్తేనే విలువ అనే భావజాలం పెరుగుతున్న నేటి సమాజానికి సుప్రీంకోర్టు తీర్పు ఒక కనువిప్పుగా మారింది. “ఇల్లాలు లేని ఇల్లు చీకటితో సమానం” అనే మాటను మరోసారి గుర్తు చేస్తూ, గృహిణుల శ్రమకు చట్టబద్ధ గుర్తింపు ఇచ్చిన తీర్పుగా ఇది నిలిచిపోనుంది.

దేశంలోని కోట్లాది మంది గృహిణుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ తీర్పు, మహిళల వేతనం లేని గృహ సేవల విలువపై సమాజంలో కొత్త చర్చకు నాంది పలికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *