కేంద్రం కీలక ఆదేశాలు: ఇకపై రీటైల్ పెట్రోల్ బంకుల్లో భారీగా డీజిల్ కొనుగోళ్లకు బ్రేక్.. 90 రోజుల నిషేధం అమలు

దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు, ఇంధన సరఫరా వ్యవస్థకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాణిజ్య, పారిశ్రామిక, సంస్థాగత వినియోగదారులు సాధారణ రీటైల్ పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి అనుమతి ఉండదు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

కేంద్రం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. రాబోయే 90 రోజుల పాటు ఈ నిబంధనలు కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఇంధన మార్కెట్లో ఏర్పడిన ధరల అసమతుల్యతను నియంత్రించడం, సామాన్య వినియోగదారులకు ఇంధన కొరత రాకుండా చూడడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా పేర్కొంది.

సాధారణంగా రీటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్య ప్రజలకు విక్రయించే ఇంధన ధరలు, పరిశ్రమలు మరియు భారీ సంస్థలకు బల్క్‌గా సరఫరా చేసే ధరల కంటే భిన్నంగా ఉంటాయి. అయితే ఇటీవల ఈ ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. ఢిల్లీలో రీటైల్ డీజిల్ ధర లీటరుకు రూ.95.20 ఉండగా, బల్క్ సరఫరా ధర రూ.134.50గా నమోదైంది. అంటే లీటరుకు దాదాపు రూ.39 వరకు తేడా ఏర్పడింది.

ఈ భారీ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్, పరిశ్రమలు, పెద్ద వాణిజ్య సంస్థలు అధికృత బల్క్ సరఫరాదారులను పక్కనపెట్టి రీటైల్ పెట్రోల్ బంకుల నుంచే భారీ మొత్తంలో డీజిల్ కొనుగోలు చేస్తున్నాయి. ట్యాంకర్లు, పెద్ద వాహనాలతో బంకులకు వెళ్లి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్ల సాధారణ వినియోగదారులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పరిశ్రమలు, తయారీ సంస్థలు, పెద్ద మాల్స్, ప్రైవేట్ రవాణా సంస్థలు తమ అవసరాలకు రీటైల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయకూడదు. కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికృత బల్క్ సరఫరాదారుల ద్వారానే నిర్ణీత ధరలకు ఇంధనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఈ తాత్కాలిక నిషేధం 90 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఈ వ్యవధిలో మార్కెట్లో ధరల వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుంది.

కేంద్రం ప్రకారం ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది. భారీ వాహనాలు, పరిశ్రమలు రీటైల్ బంకులపై ఆధారపడటం తగ్గడంతో బైకులు, కార్లు, ఆటోలు వంటి సాధారణ వాహనదారులకు ఇంధన కొరత ఏర్పడే అవకాశం తగ్గుతుంది. అలాగే రీటైల్ బంకుల్లో సరఫరా స్థిరంగా ఉండి ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

అదే సమయంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ బంకులు, ప్రైవేట్ ప్రదేశాల్లో అక్రమ నిల్వలపై నిఘా పెట్టాలని సూచించింది. తక్కువ ధరలకు రీటైల్ డీజిల్ కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించే బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని ఆదేశించింది. అలాగే అనుమతులు లేకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇంధనం తరలించకుండా హైవేలు, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

ఇంధన మార్కెట్లో నెలకొన్న అసమతుల్యతను సరిచేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలికమైనదే అయినప్పటికీ, సామాన్య వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కీలక అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ నిబంధనలను ఉల్లంఘించి రీటైల్ బంకుల్లో బల్క్ అమ్మకాలు జరిపితే సంబంధిత బంకుల లైసెన్సులను కూడా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *