తెలంగాణకు మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరం”.. సిరిసిల్లలో కేటీఆర్ భావోద్వేగ ప్రసంగం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరమని అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, పదేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతను ఒక తపస్సులా నిర్వర్తించారని వ్యాఖ్యానించారు.

సిరిసిల్ల అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, ఒకప్పుడు నక్సలిజం, నేత కార్మికుల ఆత్మహత్యలు, సాగునీటి కొరతతో అల్లాడిపోయిన ప్రాంతం నేడు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. తాలూకా కేంద్రంగా ఉన్న సిరిసిల్లను జిల్లా కేంద్రంగా మార్చడమే కాకుండా వ్యవసాయ కళాశాల, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలు తీసుకొచ్చామని చెప్పారు.

నేత కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకొచ్చిన “బతుకమ్మ చీరల” పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని కేటీఆర్ ఆరోపించారు. బతుకమ్మ చీరల వెనుక ఉన్న ఉద్దేశం నేతన్నలకు ఉపాధి కల్పించడం, ఆడబిడ్డలకు కానుక అందించడమేనని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ ఆర్డర్లను నిలిపివేసి నేత కార్మికులను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు.

రైతుల సమస్యలపై స్పందిస్తూ, కేసీఆర్ హయాంలో పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసేదని గుర్తుచేశారు. వడ్లు, మక్కలు, జొన్నలు, శనగలు, మిర్చి వంటి పంటలను నష్టాలు వచ్చినా కొనుగోలు చేసి రైతును ఆదుకున్నామని చెప్పారు. ప్రస్తుతం రైతు బంధు అమలు సరిగా లేదని, యూరియా కొరత, కొనుగోలు కేంద్రాల్లో అవ్యవస్థ నెలకొందని ఆరోపించారు.

కాంగ్రెస్ ఎన్నికల హామీలపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. రైతు బంధు పెంపు, బోనస్, గ్యారంటీల అమలుపై ఇచ్చిన హామీలు నెరవేరలేదని అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలు 900 రోజులు గడిచినా నెరవేరలేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయికి తగని భాషను ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు ఎప్పుడూ వినలేదన్నారు. తనపై ఇప్పటికే అనేక కేసులు పెట్టారని, అయినా ప్రజల తరఫున మాట్లాడడం ఆపబోనని స్పష్టం చేశారు.

రాబోయే ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికలు కాదని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్‌ను అధికారంలోకి తీసుకురావాల్సిన ఎన్నికలని కేటీఆర్ పేర్కొన్నారు. “119 నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరు అన్నది కాదు… ప్రతి స్థానంలో కేసీఆర్‌నే అభ్యర్థిగా భావించి పనిచేయాలి” అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, అలసత్వానికి తావివ్వకుండా ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలను వివరించాలని సూచించారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో తాను ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేటీఆర్ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *