కేసులు పెడితే బీఆర్ఎస్ మరింత బలపడుతుంది: రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

“స్కీములు కాదు.. స్కాములే: కేసులు పెడితే బీఆర్ఎస్ గెలుపు మరింత దగ్గరవుతుంది” – హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై వరుసగా కేసులు నమోదు చేయడాన్ని రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణించారు.

“ఇవాళ మా తమ్ముడు దేవేందర్‌పై పాత కేసులు తెరపైకి తీసుకొస్తున్నారు. వేణుపై కేసులు పెడుతూనే ఉన్నారు. రసమయి బాలకిషన్‌పై లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా కేసులు పెడుతున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఓటమి అంచున ఉన్నవాడే కేసులు పెడతాడు. ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నవాడే ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తాడు. కాంగ్రెస్ ఎంత ఎక్కువ కేసులు పెడితే, బీఆర్ఎస్ గెలుపు అంత దగ్గర్లో ఉందని అర్థం” అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను కూడా హరీశ్ రావు తప్పుబట్టారు. “ఒకసారి బీఆర్ఎస్ స్మశానానికి వెళ్లిపోయిందంటారు. మరోసారి చచ్చిన పాముతో పోలుస్తారు. ఇంకోసారి మొలకెత్తదంటారు. కానీ రైతుల వడ్లు కొనలేని ప్రభుత్వం బీఆర్ఎస్ భవిష్యత్తుపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అని విమర్శించారు.

రైతుల సమస్యలపై స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. “రెండు నెలలు దాటినా వడ్లు కొనడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఐదు కిలోల తరుగు పెడుతున్నారు. రైతులను ఆదుకునే పరిస్థితి లేదు” అని అన్నారు.

కాంగ్రెస్ పాలనను “స్కీములు కాదు.. స్కాముల పాలన”గా అభివర్ణించిన హరీశ్ రావు, బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను గుర్తు చేశారు. “ప్రజల అవసరాలను గుర్తించి కేసీఆర్ పథకాలు అమలు చేశారు. కానీ ఇప్పుడు ప్రతి శాఖలో స్కాములే కనిపిస్తున్నాయి” అని ఆరోపించారు.

గురుకుల పాఠశాలల సరఫరాల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. “ఉప్పు, పప్పు, కోడిగుడ్లు, మాంసం సరఫరాలతో పాటు బట్టలు, బూట్లు, షూల కొనుగోళ్లలో కలిపి రూ.2,000 కోట్ల టెండర్లు పిలిచారు. ఈ విషయమే సంబంధిత మంత్రులకు తెలియని పరిస్థితి నెలకొంది” అని అన్నారు.

ఉపాధి హామీ కూలీలకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని హరీశ్ రావు విమర్శించారు. “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి రూ.12 వేల ఇస్తామని మూడు బడ్జెట్లలో ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి కూడా కూలీల ఖాతాల్లో జమ కాలేదు” అని ఆరోపించారు.

అదే సమయంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలు, ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, ప్రకటనల ఖర్చులపై కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. “పేదలకు డబ్బులు లేవంటారు. కానీ క్యాంపు కార్యాలయాలకు, ప్రకటనలకు, ఇతర కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు” అని మండిపడ్డారు.

ప్రజా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. “అవ్వాతాతలకు పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు భరోసా ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ భారీ ప్రాజెక్టులకు మాత్రం నిధులు ఉన్నాయి” అని విమర్శించారు.

తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *