వందల కోట్ల అక్రమాస్తులు.. ఏసీబీకి చిక్కిన సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆర్ అండ్ బీ, నీటిపారుదల శాఖ అధికారుల ఇళ్లలో భారీగా అక్రమాస్తులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర సర్వే, భూ రికార్డుల శాఖకు చెందిన మల్టీ జోన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అవినీతి వ్యవహారం బట్టబయలైంది.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు హైదరాబాద్‌తో పాటు ఆయనకు సంబంధించిన మొత్తం పది ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రాథమికంగా రూ.13.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. అయితే ఇవి కేవలం రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా మాత్రమేనని, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సోదాల్లో నరహరి రావు నివాసంలో కట్టల కొద్దీ నగదు, భారీగా బంగారం, వెండి బయటపడ్డాయి. ఇంట్లోనే రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్ల నిల్వలు, రూ.5.44 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 1.33 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంతటితో ఆగకుండా ఆయన భార్య పేరుతో ఉన్న రెండు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. వాటిని త్వరలో తెరిచి పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక విలాసవంతమైన కియా కారును కూడా సీజ్ చేశారు.

రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు పత్రాలు లభించాయి. పుప్పాలగూడలో 2500 చదరపు అడుగుల ఫ్లాట్, రాజేంద్రనగర్‌లో 1377 చదరపు అడుగుల ఫ్లాట్, నర్సింగిలో ఒక్కొక్కటి 1860 చదరపు అడుగుల విస్తీర్ణం గల రెండు ఫ్లాట్లు ఆయన పేరుపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అదే విధంగా గచ్చిబౌలిలోని టీజీఎన్జీవోస్ కాలనీలో జీ ప్లస్ 3 భవనం, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో జీ ప్లస్ 2 భవనం ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఆస్తులన్నీ అధికార దుర్వినియోగం ద్వారా సంపాదించినవేనని ఏసీబీ అనుమానిస్తోంది.

నరహరి రావుపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు, నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు.

ఇదిలా ఉండగా, నిజాంపేట సర్వే నంబర్ 334 ప్రభుత్వ భూముల వ్యవహారంలో కూడా నరహరి రావు పేరు గతంలోనే వివాదాస్పదంగా మారింది. విలువైన ప్రభుత్వ భూములను సర్వే చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ కబ్జాదారులకు సహకరించారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. జిల్లా కలెక్టర్ లేఖ రాసి ఆరు నెలలు గడిచినా సర్వే ప్రక్రియను ముందుకు జరపకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

భూముల బాధితులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ దాడుల్లో భారీ అక్రమాస్తులు బయటపడటంతో అప్పటి ఆరోపణలకు మరింత బలం చేకూరిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే అక్రమార్కులకు అండగా నిలిస్తే సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరుసగా బయటపడుతున్న ఈ వందల కోట్ల అవినీతి వ్యవహారాలు ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి స్పష్టం చేస్తున్నాయని రాజకీయ, సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *