అందరికీ నమస్కారం. నా పేరు అలేక్య. నేను బీసి ఉమెన్ స్టేట్ కన్వీనర్‌గా, ఒక అడ్వకేట్‌గా ఈ మాటలు చెబుతున్నాను.
ఇటీవల నిరుద్యోగ సమస్యపై విట్టల్ గారు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు, ఒక నిరుద్యోగి కుమారస్వామి మరణం నేపథ్యంలో వచ్చిన భావోద్వేగ స్పందన. ఆ మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, వీడియో మొత్తం చూడకుండా, చిన్న క్లిప్ పట్టుకొని మీడియా ముందు వచ్చి కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం అత్యంత బాధాకరం.
అసలు ఇది ఎక్కడి కల్చర్?
చదువు, ఎథిక్స్, మోరల్స్ ఉన్న సమాజమా ఇది?
వీడియో మొత్తం చూడకుండా, సందర్భం అర్థం చేసుకోకుండా ట్రోలింగ్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం తెలంగాణ సంస్కృతేనా?
కొంతమంది “తెలంగాణ అయిపోయింది” అంటూ మాట్లాడుతున్నారు.
తెలంగాణ ఎప్పుడైనా అయిపోయిందా?
తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచి మొదలైంది అనేది మీకు తెలుసా?
విట్టల్ సార్ గారి తండ్రి 1969 నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1961–69 నుంచే అనేక కుటుంబాలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. మీరు పాల్గొనకపోవడం వల్ల మీకు ఈజీగా అనిపించవచ్చు. కానీ మేము కాదు. మేమంతా తెలంగాణ ఉద్యమ విక్టిమ్స్.
బందులు, బస్సులు లేక చదువులకు ఆటంకాలు, కుటుంబాల ఆదాయాలు కోల్పోవడం – ఇవన్నీ మేము అనుభవించాం. ఎంతో మంది త్యాగాలతోనే ఈ తెలంగాణ వచ్చింది.
శ్రీకాంతాచారి లాంటి నిరుద్యోగ యువకులు, ఉస్మానియా క్యాంపస్‌లో ప్రాణత్యాగాలు చేసిన అమరులు – వీళ్లంతా ఎందుకోసం చనిపోయారు?
తెలంగాణ కోసం.
అలాంటి తెలంగాణను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.
తెలంగాణ చరిత్ర చదవకుండా, ఉద్యమంలో పాల్గొనకుండా, తెలంగాణను పట్టుకొని మాట్లాడడం ఏ భాష? ఏ ఆలోచన?
ఒక ఇంటెలెక్చువల్‌గా మాట్లాడండి.
పృథ్వి అన్న, విట్టల్ అన్న, అశోక్ సార్ లాంటి వాళ్లు ఎప్పుడూ సమతావాదంతో, ఈక్వాలిటీతో మాట్లాడతారు. వాళ్లు ఏ పార్టీకి మద్దతుగా కాదు – ప్రజల తరపున మాట్లాడతారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీస్తారు. అందుకే వాళ్ల మాటలకు బలం ఉంటుంది. వాళ్లు భయపడరు. అవసరమైతే తమ జీవితాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు అశోక్ నగర్‌కు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి, జాబ్ క్యాలెండర్, ట్రాన్స్‌పరెంట్ యాక్ట్ వంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలను నమ్మే కాంగ్రెస్‌కు ఓటు వేశాం.
కానీ ప్రశ్న ఒక్కటే –
ఒక్క హామీ అయినా అమలు చేశారా?
జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
ట్రాన్స్‌పరెంట్ యాక్ట్ ఎక్కడ?
70 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న ప్రకటనల వివరాలు ఎక్కడ?
ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు?
ఎలాంటి అపాయింట్మెంట్లు ఇచ్చారు?
శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయడం లేదు?
ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ మాకు ఉంది.
ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు మాకు ఉంది.
ఈ హక్కుల ఆధారంగా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? కేసులు పెడతారా?
నిజంగా ధైర్యం ఉంటే –
ఉస్మానియా యూనివర్సిటీలోకి రండి.
అశోక్ నగర్‌కు రండి.
చిక్కడపల్లికి రండి.
నిరుద్యోగులతో ముఖాముఖి మాట్లాడండి.
అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే, కనీసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టండి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానాలు తీసుకురండి. విద్య, ఉద్యోగం అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి.
కుమారస్వామి అనే నిరుద్యోగి చనిపోవడం ఒక కుటుంబానికి మాత్రమే కాదు – సమాజానికి జరిగిన నష్టం.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబ్బులు, పదవులు లేవు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. గ్రామాలకు తిరిగితే ఈ వాస్తవాలు తెలుస్తాయి.
నిరుద్యోగుల తరపున మాట్లాడిన వాళ్లను దూషించాల్సిన అవసరం లేదు. వాళ్లు తమ పదవుల కోసం కాదు – లక్షల మంది నిరుద్యోగ యువత తరపున మాట్లాడుతున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది మీ ప్రభుత్వమే. ఇప్పుడు బీసీలు మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. ఇది న్యాయమా?
ఎవరు అధికారంలో ఉన్నా – ప్రజలే మధ్యలో నలిగిపోతున్నారు. ఓటు వేసింది మేమే. బాధ పడేది మేమే.
కాబట్టి స్పష్టంగా చెబుతున్నాం –
నిజంగా ప్రజల పక్షపాతి ప్రభుత్వం అయితే,
తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.
నిరుద్యోగుల కోసం ఫైట్ చేయాలి.
మాటలు కాదు – అమలు కావాలి.
ఇదే మా డిమాండ్.
ఇదే మా పోరాటం.

