జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భూపాలపల్లి ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం గతంలో జరిగిన అభివృద్ధి పనులేనని స్పష్టం చేశారు. డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, మెడికల్ కాలేజీ, బస్ డిపో, మున్సిపాలిటీతో పాటు గల్లీ గల్లీకి రోడ్లు, ఇంటింటికి తాగునీరు వంటి మౌలిక వసతులు ఎవరి పాలనలో వచ్చాయో ప్రజలకు బాగా తెలుసని అన్నారు.
మారుమూల ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం, సింగరేణి ప్రాంత అభివృద్ధి, భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత పూర్తిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని నేతలు పేర్కొన్నారు. అభివృద్ధి చేయలేని వారు, ప్రజలకు కనీస పెన్షన్లు ఇవ్వలేని వారు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు నకిలీ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను సాధించి, రాష్ట్రాన్ని పునర్నిర్మించిన కేసీఆర్‌పై ఒక్క మాట మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ తమ పార్టీ అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. అయితే ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని, ప్రజల ఆశీర్వాదంతో గెలుపు తమదేనని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు ఆత్మగౌరవంతో రాజకీయాలు చేస్తారని, ఓట్ల కోసం కాళ్లు మొక్కే సంస్కృతి తమకు లేదని చెప్పారు.

సంక్షేమం, అభివృద్ధే తమ రాజకీయ అజెండా అని, గతంలో చేసిన పనులే తమకు బలమని నేతలు పేర్కొన్నారు. బలహీన వర్గాల పట్ల బీఆర్‌ఎస్‌కు ఉన్న కమిట్మెంట్‌ను గుర్తు చేస్తూ, టికెట్ల పంపిణీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేశామని తెలిపారు.
ఎండ తీవ్రతను లెక్కచేయకుండా సభకు హాజరైన మహిళలు, యువత, కార్మికులకు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. చివరి ఓటు పడే వరకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల సహకారం, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు బీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తూ సభను “జై తెలంగాణ” నినాదాలతో ముగించారు.