మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరే.. జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టంచేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధి పథకాలపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీ అనేక చోట్ల కనీసం బోర్డర్ కూడా దాటలేని స్థితిలో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మూడో స్థానానికి కూడా చేరుకోలేని పరిస్థితి ఉందని పార్టీ లోపలే చర్చ జరుగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరింత చురుకుగా పనిచేయకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి రావచ్చని కొందరు బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిర్లక్ష్య ధోరణి కొనసాగితే ఎన్నికల్లో తీవ్ర నష్టం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జనసేనతో పొత్తు అంశంపై స్పందించిన రామచంద్రరావు.. తెలంగాణలో జనసేన పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా ఉన్నామని, అదే విధంగా తెలంగాణలో కూడా ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని దెబ్బతీసే శక్తి తమకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేయడం ద్వారానే పార్టీ బలాన్ని పెంచుకుంటామని తెలిపారు.

మొత్తానికి జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తేల్చి చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *