బుల్లితెర నటీనటులు అంటే కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు, విల్లాలు, ఆడంబర జీవితం గుర్తుకు వస్తాయి. కానీ ఆ గ్లామర్ ప్రపంచం వెనుక కూడా సాధారణ మనుషులలాంటి భావోద్వేగాలు, నెరవేరని కలలు ఉంటాయని బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ నటి దీపికా రంగరాజు మరోసారి నిరూపించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా రంగరాజును యాంకర్ “అకస్మాత్తుగా కోటి రూపాయలు వస్తే ఏం చేస్తారు?” అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆమె, “చెన్నైలో నాకు సొంత ఇల్లు లేదు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ఒక కోటి రూపాయలు వస్తే ముందుగా సొంత ఇల్లు కొంటాను” అని చెప్పారు.
అనంతరం జీవిత సత్యాన్ని గుర్తు చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేశాయి. “ప్రస్తుతం నాకు చెన్నైలో సొంత స్థలం లేదు. కానీ ఈ ప్రపంచంలో మనకంటూ శాశ్వతంగా దక్కేది స్మశానంలో ఆరడుగుల స్థలం మాత్రమే. మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని కలలు కన్నా చివరికి వెంట వచ్చేది ఏమీ లేదు” అని ఆమె అన్నారు.
తాను కోట్లలో సంపాదించడం లేదని, లక్షల్లోనే సంపాదిస్తున్నానని చెప్పిన దీపికా రంగరాజు, జీవితంలో డబ్బు కంటే మంచి పేరు, మనశ్శాంతి, బంధాలు ముఖ్యమని సూచించారు.
బ్రహ్మముడి సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపుకు తెలుగు ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె నిజాయితీ, నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు.

