తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న స్వరాష్ట్రం, కేవలం రెండున్నర ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో సర్వనాశనం అవుతోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. గజ్వేల్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన నేతలు, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గజ్వేల్ ప్రాంతంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం జలాలతో ఇంటింటికీ నిత్యం తాగునీరు అందిందని తెలిపారు. అప్పటివరకు బిందెలు మోసిన మహిళలకు శాశ్వత పరిష్కారం దొరికిందన్నారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగు నింపాయని గుర్తు చేశారు.
గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, గురుకులాలు, రాజీవ్ పార్క్, పాండవుల చెరువు అభివృద్ధి, సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కేసీఆర్ పాలనలోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. రైతులకు రైతుబంధు, పింఛన్లు, సాగునీటి ప్రాజెక్టులు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్‌కే దక్కుతుందన్నారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలకు కటింగ్ పెట్టిందని, పెన్షన్లు సరిగా ఇవ్వకపోవడం, మహాలక్ష్మి పథకం అమలు చేయకపోవడం, రైతులకు బోనస్, రైతుబంధు ఆలస్యం చేయడం వంటి చర్యలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
ప్రజలు ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలన్నారు. నిజంగా అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఎవరు? నీళ్లు, రోడ్లు, ఆస్పత్రులు, స్కూల్లు ఎవరు కట్టారు? అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో గజ్వేల్ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

