కల్వకుంట్ల కవిత ఇటీవల నిర్వహించిన కొత్త పార్టీ ప్రారంభోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపాయి. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు చాలా మంది లోలోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, బహిరంగంగా మాత్రం ఎవరూ స్పందించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు ఎవరూ స్పందించకపోవడం వెనుక అధిష్టానం ఆదేశాలే కారణమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. “ఎవరూ ఈ విషయంపై మాట్లాడొద్దు” అని స్పష్టమైన సూచనలు వెళ్లడంతో నాయకులు మౌనం పాటిస్తున్నారని సమాచారం. అయితే ఈ మౌనం వెనుక వ్యూహమా లేక అంతర్గత గందరగోళమా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇటీవల కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో అయినా ఈ అంశంపై స్పందన వస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ సమావేశం మొత్తం పూర్తయ్యే వరకు కవిత పేరు కూడా ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. దీంతో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని దాటవేశారా అన్న అనుమానాలు మరింత పెరిగాయి.
రాజకీయంగా చూసుకుంటే కేసీఆర్ వ్యక్తిత్వం కూడా ఈ మౌనానికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థుల పేర్లు ప్రస్తావించడం ద్వారా వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుందని భావించే నాయకత్వ శైలి ఆయనది అని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఆయన తరచుగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా “కాంగ్రెస్ ప్రభుత్వం” అని మాత్రమే మాట్లాడుతుంటారని గుర్తుచేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు కవిత పేరును కూడా ప్రస్తావించకుండా ఉండడం వెనుక అదే ఆలోచన ఉండొచ్చని భావిస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం స్పష్టమైన కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. కవిత వ్యాఖ్యలను వ్యతిరేకించాలా? లేక మౌనం పాటించాలా? ఆమె ఇంకా పార్టీకి అనుకూలంగానే ఉన్నారా? లేక ప్రత్యామ్నాయ రాజకీయ దిశలో అడుగులు వేస్తున్నారా? అన్న దానిపై కార్యకర్తలకు స్పష్టత లేకుండా పోయింది. ఒకవైపు కవిత కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నట్టుగా మాట్లాడుతుంటే, మరోవైపు ఆయన నాయకత్వంలోని లోపాలను కూడా ప్రస్తావించడం చర్చకు దారితీస్తోంది.
కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే కవిత కొత్త రాజకీయ అడుగుల వెనుక కూడా కేసీఆర్ వ్యూహం ఉండొచ్చని అంటున్నారు. మరో వర్గం మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా బీఆర్ఎస్‌ను బలహీనపర్చేందుకు ఈ పరిణామాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. ఏ కారణం అయినా సరే, ప్రస్తుతం ఈ వ్యవహారం వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నది మాత్రం బీఆర్ఎస్‌కేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో ఈ ప్రభావం అంతగా కనిపించకపోయినా, గ్రామ స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ కేడర్‌లో గందరగోళం స్పష్టంగా కనిపిస్తోందని తెలుస్తోంది. నాయకత్వం నుంచి క్లారిటీ రాకపోవడంతో కార్యకర్తలు ఎలాంటి వైఖరి తీసుకోవాలో అర్థం కాక ఇబ్బందిపడుతున్నారు. దీంతో కవిత వ్యాఖ్యల వ్యవహారం భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు మరింత రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

