మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగులుతోంది. బీ–ఫామ్ ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో అభ్యర్థులను మోసం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వరుస రాజీనామాలు చోటుచేసుకుంటున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే మల్రెడ్డి సహా పలువురు నాయకులు చివరి క్షణం వరకు బీ–ఫామ్ ఇస్తామని చెప్పి, నామినేషన్లు వేయించుకున్న తర్వాత అభ్యర్థులను పక్కన పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన కార్యకర్తలనే విస్మరించి, కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
బీసీ మహిళకు అవకాశం ఇస్తామని చెప్పి, చివరి క్షణంలో మైనారిటీ అభ్యర్థికి బీ–ఫామ్ కేటాయించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. “99 శాతం నీకే టికెట్” అని నిన్న రాత్రి వరకూ భరోసా ఇచ్చిన నాయకులు, ఉదయం 2:45 గంటలకు నిర్ణయం మార్చడంతో బాధిత మహిళా నాయకులు కన్నీటి పర్యంతమయ్యారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 24వ వార్డు ఘటన మరింత కలకలం రేపింది. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన మహిళా నాయకురాలు హరితకు రాత్రి వరకు టికెట్ ఖరారైందని చెప్పి, ఉదయం వచ్చేసరికి పూర్తిగా తిరస్కరించారు. చివరకు ఆ వార్డు టికెట్ స్థానికేతరుడు, కేవలం 15 రోజుల క్రితమే పార్టీలో చేరిన జానపల్లి గణేష్‌కు కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో డబ్బుల లావాదేవీలు జరిగాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, డీసీసీ అధ్యక్షుడే బీ–ఫామ్ చింపేశారన్న ఆరోపణలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. పార్టీ కోసం హైదరాబాద్ వరకూ తిరిగి, రాష్ట్ర నాయకత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నా చివరికి అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ 100కు పైగా మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ప్రత్యేక ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారన్న ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ “స్ట్రాటజీ” అనేది కార్యకర్తలను పక్కన పెట్టడం, ఇతర పార్టీల అభ్యర్థులను లాక్కోవడం, బెదిరింపులతో విత్‌డ్రాలు చేయించడం మాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన నాసీమా బేగం ఇంటికి వెళ్లి, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు సహా ఇతర కాంగ్రెస్ నాయకులు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేయగా, మాజీ ఎమ్మెల్యే మరి జనార్ధన్ రెడ్డి జోక్యం చేసుకొని నాసీమా బేగంకు బీఆర్ఎస్ బీ–ఫామ్ అందజేశారు.
ఈ పరిణామాలన్నింటిపై రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. “80 శాతం ప్రజాభిమానం ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పుడు, బెదిరింపులు, విత్‌డ్రాలు, ఏకగ్రీవాల కోసం ఇంత హడావిడి ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నిక అంటే ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియ అని, పార్టీలు తమకు తామే నిర్ణయించుకునే వ్యవహారం కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. బెదిరింపులు, డబ్బుల రాజకీయంతో ఏకగ్రీవాలు సాధించడాన్ని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణిస్తున్నారు.

