₹50,000 లోపు సైబర్ మోసాలకు కోర్ట్ ఆర్డర్ లేకుండానే పరిహారం.. బ్యాంకులపై పూర్తి బాధ్యత

డిజిటల్ లావాదేవులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్ సెంటర్లు, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు వంటి పద్ధతులతో సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ముఖ్యంగా యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వేదికలే ప్రధాన లక్ష్యంగా మారాయి.

రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు త్వరగా పరిహారం అందించేందుకు బ్యాంకుల బాధ్యతలను స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర హోంశాఖ కొత్త ఎస్ఓజీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ గైడ్‌లైన్స్) నిబంధనలకు ఆమోదం తెలిపింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం ₹50,000 లోపు సైబర్ మోసం జరిగితే కోర్టు ఆదేశాలు అవసరం లేకుండానే బ్యాంకులు బాధితులకు 90 రోజుల్లో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంటే చిన్న మొత్తాల మోసాలకు సంబంధించి పూర్తి బాధ్యత బ్యాంకులదే అవుతుంది. కస్టమర్ అకౌంట్ నుంచి అనుమతి లేకుండా డబ్బు వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయితే, బ్యాంకులు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఇక రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదనల ప్రకారం బాధితులకు నష్టపోయిన మొత్తంలో 85% లేదా ₹25,000 — ఈ రెండింటిలో తక్కువ మొత్తాన్ని పరిహారంగా చెల్లించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ పరిహారం జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి.

గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాల వల్ల భారీ నష్టం జరిగింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం బాధితులు మొత్తం ₹52,976 కోట్ల వరకు నష్టపోయారు. ఆర్బీఐ డేటా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 29,080 మోసాల కేసులు నమోదై ₹1,457 కోట్ల నష్టం జరిగింది. 2024–25లో కార్డ్, ఇంటర్నెట్ లావాదేవీలకు సంబంధించిన లక్షల కేసులు నమోదై వందల కోట్ల నష్టం వాటిల్లింది.

ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం బాధితులకు వేగంగా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం వంటి డిజిటల్ లావాదేవీలు అధికంగా జరిగే నగరాల్లో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

అదేవిధంగా పేమెంట్ సంస్థలు, స్టాక్ ట్రేడింగ్ యాప్‌లు సైబర్ మోసాలపై ఫిర్యాదు అందిన వెంటనే మూడు దశల వ్యవస్థలో స్పందించాల్సి ఉంటుంది. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రజలు కలిసి అప్రమత్తంగా ఉంటేనే ఈ డిజిటల్ నేరాలను నియంత్రించగలమని నిపుణులు సూచిస్తున్నారు.

డిజిటల్ యుగంలో సౌలభ్యం పెరిగినంతగా అప్రమత్తత కూడా పెరగాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *