ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ దే పైచేయి… మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉండొచ్చని అంచనా వేయబడింది. కాంగ్రెస్‌కు 68 నుంచి 76 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, బీఆర్ఎస్‌కు 29 నుంచి 36 స్థానాలు, బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వచ్చే అవకాశముందని సర్వే వెల్లడించింది. అలాగే 8 నుంచి 14 స్థానాల్లో గట్టి పోటీ ఉండొచ్చని పేర్కొంది.

మరో సర్వే సంస్థ పల్స్ టుడే కూడా కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు సుమారు 84 నుంచి 85 శాతం వరకు ఫలితాలు అనుకూలంగా ఉండొచ్చని, బీఆర్ఎస్‌కు 23 నుంచి 27 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 5 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మొత్తం మీద కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి సహజంగానే ఎక్కువ ప్రభావం ఉంటుందని, ఎన్నికల ఫలితాలపై అది ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తుది ఫలితాలు ఎలా ఉంటాయన్నది ప్రజల తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అదనపు డీజీపీ మహేష్ భగవత్‌తో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించినట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచి క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8203 పోలింగ్ స్టేషన్లకు భారీ భద్రత కల్పించామని తెలిపారు. వీటిలో 1302 హైపర్ సెన్సిటివ్, 1926 సెన్సిటివ్, 4975 సాధారణ కేంద్రాలుగా గుర్తించి పరిస్థితికి అనుగుణంగా బలగాలను మోహరించినట్లు వివరించారు. వృద్ధులు, వికలాంగులు ఓటు వేయడానికి పోలీస్ సిబ్బంది సహకరించారని తెలిపారు.

ములుగు జిల్లాలో పోలింగ్ సమయంలో అస్వస్థతకు గురైన ఓటర్లకు భద్రతా సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలీస్ సిబ్బందిని డీజీపీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *