ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్‌పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల మారేడుమిల్లి–రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లలో హతమైన మావోయిస్టులు ఎన్కౌంటర్‌లో కాకుండా అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారని మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆరోపించింది.
డీకేఎస్‌జెడ్‌సీ పేరిట విడుదలైన లేఖలో, కామ్రేడ్ హిడ్మా, శంకర్ సహా మరో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు నిరాయుధులుగా అరెస్టు చేసి, హత్య చేశారని స్పష్టం చేసింది. ఈ హత్యలు కచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్లే అన్నది లేఖలో పొందుపరిచిన ఆరోపణ.
మావోయిస్టులు తెలిపిన దాని ప్రకారం, హిడ్మా డిసెంబర్ 15న చికిత్స కోసం విజయవాడకు వచ్చారని పేర్కొన్నారు. అయితే సమాచారం ఇవ్వడంలో ఒక కలప వ్యాపారి ద్రోహం కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు.
అదేవిధంగా, ఈ ఆపరేషన్‌లో మరో 50 మందిని పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే అరెస్టులో ఉన్న వారిలో దేవ్జీ మల్లారాజిరెడ్డి లేరని స్పష్టంచేశారు.
ఈ ఘటనలపై మావోయిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసులు అడవుల్లో భయపెట్టి, నెపంతో ఎన్కౌంటర్లు నిర్వహిస్తున్నారని అన్నారు. సామాజికంగా మార్పు కోసం పోరాడినవారిని చంపడం అత్యంత అమానుషమన్నారు.
సామాజిక వేదికల్లో ఇప్పుడు ప్రశ్న ఒక్కటే:
ఎన్కౌంటర్‌లు న్యాయమా? లేక మానవ హక్కుల ఉల్లంఘనా?”
ఈ ప్రశ్న ప్రజాసమాజం ముందు నిలబడగా, దీనిపై చర్చ, వాదన మరింత వేగంగా సాగుతోంది.

