ప్రజాసేవే లక్ష్యం… వరంగల్ వరద నష్టాలు, కృష్ణానగర్ సమస్యలపై అసెంబ్లీలో తొలి ప్రసంగం

తెలంగాణ శాసనసభ వేదికగా తొలి ప్రసంగం చేసిన సభ్యుడు భావోద్వేగంగా మాట్లాడారు. మంత్రులు, సభ్యులు, అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి తన పేరును ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రెండేళ్ల లోపే శాసనసభ సభ్యుడిగా ఈ సభలో అడుగుపెట్టడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే తనను ఆశీర్వదించి శాసనసభకు పంపిన ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సభా మర్యాదలను గౌరవిస్తూ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

తన నియోజకవర్గంలో ఉన్న కృష్ణానగర్ ప్రాంతంలో గత 30–40 ఏళ్లుగా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ అంశాన్ని ఇప్పటికే మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఆలస్యం కాకుండా పనులు పూర్తిచేయాలని సభ ద్వారా కోరారు. అలాగే, హై టెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా గతంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేస్తూ, అండర్ గ్రౌండ్ కేబులింగ్ త్వరగా పూర్తిచేస్తే ప్రజలు సురక్షితంగా ఉంటారని సూచించారు.

ఆర్థిక ఇబ్బందుల వల్ల టెన్త్ తర్వాత చదువు కొనసాగించలేని విద్యార్థులు ఉన్నారని, ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.

ఇదే సందర్భంగా గత నెలలో వచ్చిన మోహంతా తుఫాన్ కారణంగా వరంగల్ నగరంలో జరిగిన వరద నష్టాలను ప్రస్తావించారు. కాకతీయుల కాలం నాటి గొలుసు చెరువుల నుంచి వచ్చిన వరద నీటితో అనేక కాలనీలు జలమయమయ్యాయని తెలిపారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి వెంటనే వరంగల్‌ను సందర్శించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, బాధిత కుటుంబాలకు నెల రోజుల రేషన్, ప్రతి కుటుంబానికి రూ.15,000 సహాయం, మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా గోపాలపూర్ చెరువు విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో చెరువు ఆక్రమణకు గురై రూపురేఖలు మారిపోయాయని, వరద సమయంలో కట్ట తెగడంతో వివేక్‌నగర్ కాలనీలోని ఉద్యోగస్తుల ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వివరించారు.

ఈ నేపథ్యంలో గోపాలపూర్ చెరువును తక్షణమే రిటైనింగ్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సభ ద్వారా విజ్ఞప్తి చేశారు.

అలాగే, చెక్‌డ్యామ్‌లను బాంబులతో పేల్చుతున్నారన్న అసత్య ప్రచారాలు సభలో మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానిస్తూ, అటువంటి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *