జీవో 59 ముసుగులో 50 వేల కోట్ల భూముల దోపిడీ?అర్ధరాత్రి కన్వేయన్స్ డీడ్లు, అనుమానాల నడుమ కొత్త POB లిస్ట్

బిఆర్ఎస్ హయాంలో జీవో నెంబర్ 59 పేరుతో అర్ధరాత్రి భూముల బదలాయింపులు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జీవో 59 కింద జరిగిన రెగ్యులరైజేషన్ ప్రక్రియలో దరఖాస్తులకు జత చేసిన పత్రాలను సరిగా పరిశీలించకుండానే, ఒక్కొక్కరికి వేల గజాల నుంచి ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలో గజం మూడు లక్షల రూపాయలు పలుకుతున్న ప్రాంతాల్లో కేవలం 12 వేల రూపాయల నామమాత్రపు ఫీజుతోనే రాత్రికి రాత్రే కన్వేయన్స్ డీడ్లు ఇచ్చినట్లు సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అర్ధరాత్రి దందాను గుర్తించి అనేక ఫైళ్లను పెండింగ్‌లో పెట్టినట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికీ ఆ భూములు ప్రభుత్వ ఖాతాలోకి రాయలేదు, పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భూములను ఇప్పుడు ఎవరి పేర్లపై రాస్తున్నారు అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిషేధిత భూముల (POB) జాబితా రూపొందిస్తున్న క్రమంలో, పెండింగ్‌లో ఉన్న లేదా రిజెక్ట్ అయిన ఫైళ్లకు సంబంధించిన భూములన్నింటినీ ప్రభుత్వ ఖాతాలోకి రాయాల్సి ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. నిజాయితీగా రెగ్యులరైజ్ అయిన భూములను మాత్రం POB జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రెగ్యులరైజేషన్ ఫైళ్లను సీరియస్‌గా తీసుకోకపోతే మరోసారి అక్రమ క్రయవిక్రయాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సర్వే నెంబర్ వారీగా ఎంత భూమి రెగ్యులరైజ్ అయింది, ఎంత ప్రభుత్వానికి మిగిలింది అన్న పూర్తి లెక్కలు తీసుకోకుండా పాత POB జాబితా ఆధారంగానే కొత్త జాబితా తయారవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు, శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నెంబర్ 93లో ఎంత భూమి రెగ్యులరైజ్ అయింది, ఎంత రిజెక్ట్ అయిందన్న స్పష్టత లేకుండానే మొత్తం విస్తీర్ణాన్ని నిషేధిత జాబితాలో ఉంచడం వల్ల పెద్ద ఎత్తున లెక్కల తేడాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదే తరహాలో మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఏకంగా 33,600 గజాల భూమిని రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తు చేసిన ఘటన, అలాగే శేర్లింగంపల్లి సర్వే నెంబర్లు 106, 107లో 53,240 గజాల భూమికి దరఖాస్తు చేసిన కేసులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంటే ఇద్దరి దగ్గర కలిపి దాదాపు 18 ఎకరాల యూఎల్సీ భూమి ఉన్నట్లు సమాచారం.

ఇంత భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? యూఎల్సీ భూములని తెలిసినా ఎందుకు కొనుగోలు చేశారు? విక్రయించిన వ్యక్తికి హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ లావాదేవీల్లో రాజకీయ నేతల పాత్ర ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒక్క ఎకరం కనీసం 50 కోట్లకు పైగా విలువ చేసే ఈ ప్రాంతాల్లో, మొత్తం మీద దాదాపు 900 కోట్ల రూపాయల విలువైన భూమి ఇద్దరి వద్దే ఉన్నట్లు అంచనా. అయినప్పటికీ ఈ వ్యవహారంపై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ గట్టి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి.

దాదాపు 50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సిన పరిస్థితి ఉండగా, అదే భూమిని మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు ఇండైరెక్ట్‌గా అమ్ముతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్థాయి భూకబ్జాలు రాజకీయ నేతల అండ లేకుండా సాధ్యం కాదన్న అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *