ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ
కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు
హైదరాబాద్‌లోని కోట్ల రూపాయల విలువైన ఐడీపీఎల్ భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న భూముల అన్యక్రాంతంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమగ్ర విచారణ చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఐడీపీఎల్‌కు చెందిన పారిశ్రామిక భూములను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్‌గా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వినియోగించారని ఆమె ఆరోపించారు. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐదు ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను నివాస భూమిగా మార్చడం వెనుక భారీ అవినీతి జరిగిందని కవిత ఆరోపణలలో పేర్కొన్నారు.
ఈ భూముల వ్యవహారంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాత్ర ఉందని, అధికార యంత్రాంగ సహకారంతోనే భూ వినియోగ మార్పిడి జరిగిందని కవిత ఆరోపిస్తున్నారు. ఈ మార్పిడి వెనుక రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపై కూడా విజిలెన్స్ బృందం దృష్టి సారించింది. అప్పటి నిబంధనలు ఎలా ఉల్లంఘించబడ్డాయి, ఫైళ్లు ఎవరి ఆదేశాల మేరకు క్లియర్ అయ్యాయి అనే అంశాలపై విచారణ జరుగుతోంది.
ఇదే సమయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఎదురుదాడికి దిగారు. వేల కోట్ల విలువైన ఐడీపీఎల్ భూములను కవిత భర్త అనిల్ అక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఆయన పత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
అయితే కవిత ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన భర్త అనిల్ 2019లోనే ఆ పెట్టుబడుల నుంచి పూర్తిగా తప్పుకున్నారని స్పష్టం చేశారు. ఆ తర్వాత భూములు నవానామి వెంచర్స్ చేతుల్లోకి వెళ్లాయని, ఆ సంస్థలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలకు సన్నిహితుల భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. మాధవరం కృష్ణారావు తన కుటుంబ సభ్యుల అక్రమాలను దాచిపెట్టి, రాజకీయ దురుద్దేశంతో తన భర్తపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు
ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. సర్వే నెంబర్ 376లో మొత్తం ఎంత భూమి ఉంది, అందులో ఎంత భాగం అన్యక్రాంతమైంది, ప్రస్తుత మార్కెట్ విలువ ఎంత, అక్రమంగా భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి, రెవెన్యూ రికార్డులు ఎలా మారాయి అనే అంశాలపై విజిలెన్స్ బృందం లోతైన విచారణ చేపట్టింది.
రాజకీయ వత్తిళ్లకు తలగ్గి నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే విజిలెన్స్ బృందం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుండటంతో, ఐడీపీఎల్ భూముల వ్యవహారంలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనంగా మారుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

