జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హోరాహోరీ: “హైదరాబాద్‌కు అన్యాయం” అంటూ బీజేపీ నిరసనలు

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై వివాదం:

“ఇది అభివృద్ధి కాదు, హైదరాబాద్‌కు అన్యాయం” – బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన

హైదరాబాద్ నగరంలో ప్రతిపాదిత జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దాదాపు 300 డివిజన్లుగా విభజన చేసే యోచనపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుండటాన్ని బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ వెనుక అభివృద్ధి లక్ష్యం కంటే, ఎంఐఎం కి అనుకూలంగా రాజకీయ లెక్కలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నది ఒక్కటే—
“మేము పార్టీ ప్రతినిధులుగా కాదు, హైదరాబాద్ పౌరులుగా మాట్లాడుతున్నాం” అని.
హైదరాబాద్‌కు అన్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

డివిజన్ల మధ్య తీవ్ర అసమానతలు

ప్రస్తుతం పాత నగర పరిధిలోని ఎంఐఎం ఆధిపత్య డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు 18 వేల నుంచి 20 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయని, అదే సమయంలో శివారు ప్రాంతాల డివిజన్లలో 68 వేల నుంచి 80 వేల వరకు ఓట్లు ఉన్నాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
ఈ విధమైన ఇన్ఈక్వాలిటీ (అసమానత) ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు అంటున్నారు.

హడావుడిగా మార్పులు ఎందుకు?

డీలిమిటేషన్ పేరుతో రెవెన్యూ సరిహద్దులు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్ని కూడా మార్చడం వెనుక గల ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
“ఇది అభివృద్ధి కోసం కాదు…
రేవంత్ రెడ్డి భూముల విలువలు పెంచుకోవడానికి,
ఎంఐఎం కి హైదరాబాద్‌ను గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వడానికి చేస్తున్న కుట్ర” అని బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే, “హైదరాబాద్‌లో మళ్లీ రజాకార్ పాలన తీసుకురానివ్వం” అంటూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ ఆర్థిక స్థితి దయనీయమని విమర్శ

ఇప్పటికే జీహెచ్ఎంసీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

  • కార్పొరేషన్ అప్పులపాలు
  • నెలనెలా వడ్డీలు చెల్లించే పరిస్థితి
  • చెట్ల కొమ్మలు కట్ చేయడానికి కూడా పరికరాలు లేవు
  • డ్రైనేజీ వ్యవస్థ దారుణం
  • నాలాల్లో పడి మరణాలు
  • రోడ్లపై గుంతలు
  • స్ట్రీట్ లైట్లు పనిచేయని పరిస్థితి

ఇలాంటి స్థితిలో శివారు గ్రామాలను జీహెచ్ఎంసీలో కలపడం ప్రజలపై అదనపు భారం మోపినట్లేనని వారు అంటున్నారు.

టాక్సులు ముందు… సేవలు తర్వాత?”

ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీలో కలిపితే,
మొదట పన్నులు పెరుగుతాయి,
సేవలు మాత్రం చివర్లో వస్తాయని బీజేపీ హెచ్చరిస్తోంది.

“రోడ్లు లేవు, ఫ్లైఓవర్లు లేవు, ఆఫీసులు లేవు…
ఇలాంటి ప్రాంతాలను కార్పొరేషన్‌లో కలిపితే ప్రజలకు న్యాయం ఎక్కడ?” అని ప్రశ్నిస్తున్నారు.

సమాన జనాభా ప్రాతిపదికన డివిజన్లు కావాలి

బీజేపీ స్పష్టం చేసింది—
30,000 నుంచి 40,000 జనాభా ప్రాతిపదికన అన్ని డివిజన్లు సమానంగా విభజిస్తే తమకు అభ్యంతరం లేదని.
కానీ ఒకచోట తక్కువ జనాభా, మరోచోట 70–80 వేల జనాభాతో డివిజన్లు ఉండటం మాత్రం అంగీకరించబోమని తేల్చిచెప్పారు.

మేయర్ స్పందన లేదన్న ఆరోపణ

ఈ అంశంపై మేయర్‌కు వినతులు ఇచ్చినా, స్పష్టత ఇవ్వలేదని, సమస్యలను వినలేదని బీజేపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా, నిరసనలు చేపట్టారు.

భారీ బందోబస్తు, హై టెన్షన్ వాతావరణం

నిరసనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
“ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి” నెలకొందని స్థానికులు చెబుతున్నారు.

స్పష్టమైన హెచ్చరిక

చివరగా బీజేపీ నేతలు ఒకే మాట అంటున్నారు—
“ఈ డీలిమిటేషన్‌ను ఈ రూపంలో మేము అంగీకరించము.
ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *