జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం ముగిసి, హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సవాల్ సవాల్‌గా మారిన ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారింది. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నిక ప్రజానాడిని అంచనా వేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఈ ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన పార్టీలు — బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ — ఏ ఒక్కటీ వెనుకడుగు వేయలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని స్థాయిల నాయకత్వం జూబ్లీహిల్స్‌లో మకాం వేసి ప్రజల్లోకి దిగి విస్తృతంగా ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్, హరీష్ రావు, మాగంటి సునీత వంటి నేతలు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రస్తావన చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ జూబ్లీహిల్స్‌లో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. 150 కోట్ల రూపాయల నిధులతో బస్తీ అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ వంటి పనులు ఒక నెలలోనే చేపట్టడం కాంగ్రెస్‌కు పాజిటివ్ పాయింట్‌గా మారింది. గత 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ ఒక్క ఉపఎన్నిక కారణంగా పూర్తి కావడం ప్రజల్లో చర్చనీయాంశమైంది.
మరోవైపు, బీజేపీ కూడా మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కృషి చేసింది. అయితే సర్వేలు ప్రకారం బీజేపీ ప్రదర్శన 8-10% మధ్యనే ఉంటుందని అంచనాలు సూచిస్తున్నాయి.
ఈ ఉపఎన్నికలో మైనారిటీ ఓట్లు, సెటిలర్ ఓట్లు కీలకంగా మారాయి. ప్రధానంగా మైనారిటీ వర్గం ఎవరికీ మద్దతు ఇస్తుందనే అంశం తుది ఫలితాలను ప్రభావితం చేయనుంది.
ప్రచార చివరి రోజుల్లో బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య నేరుగా మాటల యుద్ధం చెలరేగింది. బిఆర్ఎస్ అభివృద్ధి హామీలను కాంగ్రెస్ తిప్పికొడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బిఆర్ఎస్ విమర్శలు చేసింది.
రేవంత్ రెడ్డి చేసిన ర్యాలీలలో కొన్ని ప్రసంగాలు విమర్శలకు గురయ్యాయి. ఆయన స్పీచ్‌లు ట్రోలింగ్‌కు గురవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అయితే, అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానిక నాయకత్వం, బూత్ స్థాయి కార్యకలాపాలతో పాజిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు మంగళవారం పోలింగ్‌తో తుది దశలోకి అడుగుపెడుతున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే కానీ, ప్రజల తీర్పు మాత్రం రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశను చూపనుంది అనడంలో సందేహం లేదు.

