కవిత కాంగ్రెస్‌లోకి వెళ్తే ఆశ్చర్యం లేదు..! మంత్రి పదవి రాకపోతే పార్టీకే నష్టం: మాల్రెడ్డి రంగారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆశ్చర్యం ఏమీ లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్పందించిన మాల్రెడ్డి రంగారెడ్డి.. “కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి వస్తారని మేము అనుకున్నామా? రాలేదు కదా. అలాగే కవిత కాంగ్రెస్‌లోకి వెళ్తే ఆశ్చర్యం ఏముంటుంది?” అంటూ వ్యాఖ్యానించారు.

రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అన్నది కేవలం ఊహాగానమేనని ఆయన కొట్టి పారేశారు. జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినా జిల్లా స్వరూపం మారకూడదని స్పష్టం చేశారు. హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు రెండు కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ ఇప్పటివరకు అక్కడి నుంచి ఒకరికీ కూడా మంత్రి పదవి దక్కలేదని గుర్తు చేశారు.

తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తనకు వ్యక్తిగతంగా నష్టం ఏమీ లేదని, కానీ అది పార్టీకి నష్టమని మాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఒకసారి ఆలోచన చేయాలని సూచించారు. ప్రస్తుతం సొంత పార్టీలోనే మంత్రి పదవులు ఆశించే నేతలు చాలా మంది ఉన్నారని కూడా తెలిపారు.

ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెరిగినప్పటికీ, ధరలు పెరుగుతున్నాయని చెప్పి భూములు అమ్మే పరిస్థితి లేదన్నారు.

ఇక కవిత రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో కవితకు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయని, కవిత వెనుక కూడా రేవంత్ రెడ్డి హస్తం ఉందనే ప్రచారం వినిపిస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కవిత కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *