మిర్యాలగూడలో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ నేత తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పోలీసుల నోటీసుల అంశాన్ని ప్రస్తావిస్తూ, కొందరు తమను “జాతిపిత”గా ప్రకటించుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెలంగాణకు సేవ చేసిన నాయకత్వమే గౌరవానికి అర్హమని అన్నారు.
తెలంగాణ సమాజం పేరుతో మాట్లాడే వారికి రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏమిటని ప్రశ్నించారు. జన్వాడ, ఎర్రవల్లి, మోయినాబాద్‌లలో ఉన్న ఫామ్‌హౌసులు తెలంగాణ ప్రజలవా అంటూ నిలదీశారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన వారు తెలంగాణ నిరుద్యోగులకు, పేదలకు ఏమిచ్చారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే సంస్థను సీఎం బినామీ కంపెనీగా పేర్కొంటూ, దివాలా దశలో ఉన్నప్పటికీ సుమారు రూ.6 వేల కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిందని ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
అమృత్ స్కీమ్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాల కింద కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు భారీగా పనులు కేటాయించారన్నారు. ముఖ్యమంత్రి ఉపయోగించిన ల్యాండ్ క్రూజర్ వాహనం కూడా అదే కంపెనీ పేరుతో రిజిస్టర్ అయి ఉందని ఆరోపిస్తూ ఫోటోలు, డాక్యుమెంట్లను చూపించారు.
కేఎల్ఎస్ఆర్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వాలనే ఒత్తిడి కారణంగా ఎన్‌సీఎల్‌ఏటీలో ఓ న్యాయమూర్తి తప్పుకున్న ఘటనను కూడా ప్రస్తావించారు. సీఎం పదవిలో ఉండి తన బినామీ కంపెనీలకు వేల కోట్ల ప్రాజెక్టులు కేటాయించారని ఆరోపిస్తూ, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
చివరగా, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా అహంకారంతో మాట్లాడటం తగదని వ్యాఖ్యానించారు.

