మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి అంతర్గత వెన్నుపోటు భయం పట్టుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ టిక్కెట్లు దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో పలుచోట్ల బీజేపీ ప్రచారం బలహీనంగా కనిపిస్తున్నదని సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో వార్డుల వారీగా పోటీ స్పష్టమైందీ, అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే బీజేపీ అభ్యర్థులకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే ప్రమాదం పొంచి ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి, పైరవీలతో కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చారని టికెట్ దక్కని నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు.
టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు తమ రాజకీయ శక్తిని చూపించాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీ-ఫారమ్ దక్కని కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేయగా, మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి.
ఈ ఒప్పందాల కింద ఆర్థికంగా సహకరించే వారికి లేదా బీజేపీ అభ్యర్థులను ఓడించే సత్తా ఉన్న ఇతర పార్టీ నేతలకు లోపాయికారీ మద్దతు అందించేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు టికెట్లు దక్కని బీజేపీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఇక బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు అసమ్మతి నేతలను మచ్చిక చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారట. పరిదెద్దల సహాయంతో రాయభారాలు పంపుతూ, గెలిచిన తర్వాత కాంట్రాక్టులు, ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యత ఇస్తామని హామీలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి వెయ్యి ఓట్లకు ఒక ఇన్‌చార్జీని నియమించి వారికి భారీగా ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది.
ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అధికార కాంగ్రెస్ 12, విపక్ష బీఆర్ఎస్ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఏకగ్రీవాల పెరుగుదలపై ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు ఓటు హక్కు ఇచ్చే అవకాశమే లేకుండా ఎన్నికల నిర్వచనమే మారిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

