త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?: పొన్నం, కొండా సురేఖ తొలగింపు వార్తలపై మహేష్ గౌడ్ స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలని ఆయన కితాబు ఇచ్చారు.

అయితే శాఖల మార్పులు లేదా మంత్రివర్గంలో ఇతర మార్పులు ఉంటాయా అనే అంశంపై తనకు స్పష్టత లేదని చెప్పారు. తాను మంత్రివర్గంలోకి వెళ్తాననే ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీ వేణుగోపాల్ తనను మంత్రివర్గంలోకి రావాలని ఆహ్వానించారని, కానీ తనకు ఆ పదవిపై ఆసక్తి లేదని తేల్చిచెప్పినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేయడమే తనకు సంతృప్తినిస్తుందని మహేష్ గౌడ్ అన్నారు.

ఇక నెల రోజుల్లో కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీల నియామకాలు పూర్తవుతాయని, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కూడా తుది దశకు చేరిందని వెల్లడించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

ఉప్పల్‌లో జరిగిన మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమేనని, ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణపై పడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సహకరించిందని మహేష్ గౌడ్ తెలిపారు. అయితే ప్రైవేట్ కార్యక్రమమైతే ప్రభుత్వం ఎందుకు విస్తృతంగా ప్రచారం చేసిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం స్వయంగా పాల్గొనడం, భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం రాజకీయంగానే ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకున్నారన్న విమర్శలకు దారి తీసింది.

రాజకీయంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని, కవిత వ్యవహారంతో ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ తిన్నదని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తుచేశారు.

గ్లోబల్ సమిట్, ఫోర్ సిటీ, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల పేరుతో ప్రచారం తప్ప, వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడే ఫలితాలు ఏమిటన్న ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *