ముద్రా లోన్ ఇప్పిస్తామని చెప్పి మహిళను మోసం చేసిన కేసులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులను హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాబ్ సెర్చింగ్‌లో భాగంగా సైబర్ నేరస్తులతో పరిచయం ఏర్పడి, చివరికి వారే సైబర్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గత ఏడాది నవంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లోన్స్‌కు సంబంధించిన ప్రకటనను చూసింది. మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, మీకు రూ.3 లక్షల ముద్రా లోన్ మంజూరైందని చెప్పాడు. ఆధార్ వివరాలు పంపితే రుణం ఖాతాలో జమ చేస్తామని నమ్మించాడు.
మహిళ ఆధార్ వివరాలు పంపిన వెంటనే టిడిఎస్, ఇన్సూరెన్స్ చార్జీలు అంటూ మొత్తం లక్ష రూపాయలు వసూలు చేశారు. తర్వాత రుణం వద్దని చెప్పినా కూడా అదనంగా రూ.15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు బి. అరుణ్, జి. భరత్, ఎస్. తిరుపతి, బి. తరుణ్, సి. శ్యామ్‌లను బుధవారం అరెస్ట్ చేశారు.
విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వరంగల్ జిల్లాలోని గ్రామాలకు చెందిన ఈ యువకులు చదువు మధ్యలోనే మానేసి దినసరి కూలీలుగా పని చేస్తున్నట్లు తెలిసింది. 2023లో ఫేస్‌బుక్‌లో ఉద్యోగాల కోసం వెతుకుతుండగా రాహుల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫేక్ ముద్రా లోన్ కాల్ సెంటర్‌లో పని చేసే అవకాశం ఉందని చెప్పడంతో డబ్బుల అవసరం వల్ల వీరు అంగీకరించారు.
కృష్ణ అనే వ్యక్తి వీరిని హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళ్లి, లోన్స్ పేరుతో ఎలా మోసం చేయాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల డేటా అందించి కాల్స్ చేయించారు. నెల రోజుల్లోనే 180 నుంచి 200 మందిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్నారు. అందుకు వారికి 30 శాతం కమిషన్ కూడా ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఈ ఐదుగురు సోషల్ మీడియా ద్వారా ముద్రా లోన్ ప్రకటనలు ప్రచారం చేసి అమాయకులను మోసం చేస్తూ వచ్చారని విచారణలో తేలింది.
ఈ ఘటనతో ఉద్యోగాల కోసం వెతుకుతూ సైబర్ నేరాల్లోకి అడుగుపెట్టిన యువత పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతోందో స్పష్టమవుతోంది. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే లోన్ ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.

