హాస్టల్‌లో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహంతో విద్యార్థినులు రాత్రంతా రోడ్లపై ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి సుమారు 9 గంటల నుంచి ఉదయం వరకు హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నా కొనసాగించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.
విద్యార్థినుల వివరాల ప్రకారం, ఒక విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చినప్పటికీ లోపలికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. హాస్టల్ నిబంధనల్లో పేరెంట్స్‌కు అనుమతి లేదని చెప్పి తిరస్కరించారని ఆరోపించారు. గెస్ట్‌గా వచ్చిన తల్లిదండ్రులకు కనీసం తాత్కాలిక వసతి కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని విద్యార్థినులు అంటున్నారు.
అంతేకాకుండా, హాస్టల్‌లో ఫుడ్ నాణ్యత బాగోలేదని, వీధి లైట్లు సరిగా పనిచేయవని, ప్రాథమిక వసతి సౌకర్యాలు కూడా లేవని ఆరోపించారు. సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని చెప్పారు. ముఖ్యంగా డైరెక్టర్ కళ్యాణలక్ష్మి ఫిర్యాదులు స్వీకరించినప్పటికీ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థినులు విమర్శించారు.
రాత్రంతా ఆడపిల్లలు రోడ్లపై కూర్చున్నా కూడా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ వచ్చి మాట్లాడినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు. డైరెక్టర్ స్వయంగా వచ్చి సమస్యలు వినాలని డిమాండ్ చేసినప్పటికీ ఆమె రాలేదని పేర్కొన్నారు.
డైరెక్టర్ తక్షణం వచ్చి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, అవసరమైతే ఆమెను సస్పెండ్ చేయాలని లేదా రాజీనామా చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో ప్రముఖ యూనివర్సిటీగా పేరున్న విద్యాసంస్థలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని విద్యార్థినులు అంటున్నారు. సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కోసం పోరాటం తప్పదని తెలిపారు.
ఇదిలా ఉండగా, విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే “జస్టిస్ కావాలి”, “డైరెక్టర్ రావాలి” అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.

