నేషనల్ హెరాల్డ్ కేస్: ఈడీ నోటీసులతో కాంగ్రెస్‌ను భయపెట్టలేరు – బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

నేషనల్ హెరాల్డ్ కేస్ నేపథ్యంలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై స్పందిస్తూ, ఇది ఇక్కడితో ఆగేది కాదని, ముందు ముందు పోరాటం మరింత ఉధృతమవుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా మార్చుకుని ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దేశం మొత్తం చూస్తోందని వ్యాఖ్యానించారు.

గతంలో మహారాష్ట్రలో అశోక్ చౌహాన్, అజిత్ పవార్, సుజనా చౌదరి వంటి నాయకులకు ఈడీ నోటీసులు ఇచ్చి, తరువాత బీజేపీలో చేరగానే కేసులను వెనక్కి తీసుకున్న ఉదాహరణలను కాంగ్రెస్ గుర్తు చేసింది. అలాగే హిమంత బిశ్వ శర్మ, ప్రఫుల్ పటేల్, సువేందు అధికారి వంటి నేతలను కూడా ఈడీ నోటీసుల ద్వారా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారని విమర్శలు చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ నోటీసులు ఇచ్చి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరిగిన సభ, బీహార్‌లో కనిపించిన జనసంద్రం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

సోనియా గాంధీని 2013లో ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మూడో స్థానంలో గుర్తించిందని గుర్తు చేశారు. అలాంటి శక్తివంతమైన నాయకురాలిని బీజేపీ తాటాకు చప్పుళ్లతో భయపెట్టలేదని స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని కూడా ఈడీ నోటీసులు ఏమాత్రం ప్రభావితం చేయలేవని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్లాక్ మనీ నిర్మూలన పేరుతో కమిటీలు వేసి మధ్యలోనే ఆపేసిందని, ఎవరి కోసం ఆపేశారో దేశ ప్రజలకు తెలుసునని విమర్శించారు. గౌతమ్ అదానిపై ఉన్న ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే ముందు కార్పొరేట్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ సాక్షిగా ప్రజల భద్రతకన్నా విదేశీ కార్పొరేట్ కంపెనీల లాభాలకే ప్రాధాన్యం ఇస్తూ కీలక బిల్లులను జాయింట్ కమిటీకి పంపకుండా ఆమోదించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొంది.

ఈడీ నోటీసులు, బెదిరింపులు ఎంత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని, ర్యాలీలు, ధర్నాలు మరింత ఉధృతం అవుతాయని స్పష్టం చేస్తూ, “ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే” అని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *