కొత్త ఉపాధి హామి బిల్లుతో గ్రామీణాభివృద్ధి దిశగా అడుగు.. కాంగ్రెస్ వ్యతిరేకతపై రాజకీయ వేడి

పార్లమెంట్ సమావేశాలు ఇటీవలే ముగియగా, త్వరలో బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, పథకాలు ఆమోదం పొందాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనదిగా కొత్త ఉపాధి హామి బిల్ నిలుస్తోంది. ఈ బిల్ ద్వారా దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక లాభం చేకూరుతుందని పాలక వర్గాలు చెబుతున్నాయి.

ఉపాధి హామి భావన కొత్తది కాదని, బ్రిటిష్ కాలం నుంచే వివిధ రూపాల్లో అమలులో ఉందని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. కరువు కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన స్కేర్‌సిటీ రిలీఫ్ పథకాల నుంచి ప్రారంభమై, స్వాతంత్ర్యానంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ “రైట్ టు వర్క్”ను ప్రాథమిక హక్కుగా ప్రస్తావించారని నేతలు వివరిస్తున్నారు.

1960లలో రూరల్ మ్యాన్‌పవర్ ప్రోగ్రాం, 1971లో క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్, మహారాష్ట్రలో అమలైన ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ వంటి పథకాలు ఉపాధి హామి భావనకు పునాది వేశాయని చెబుతున్నారు. 2006లో మహాత్మా గాంధీ పేరుతో ప్రారంభమైన ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కూడా ఇదే శ్రేణిలోకి వస్తుంది.

అయితే పాత ఉపాధి హామి పథకంలో అనేక లోపాలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. తక్కువ కూలీ, మధ్యవర్తుల జోక్యం, లంచాల సమస్యల వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని ఆరోపణలు వినిపించాయి. 2014 తర్వాత ఈ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్‌ను చేర్చడం ద్వారా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అవకాశం కల్పించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల గదులు, మరుగుదొడ్లు వంటి పనులను గ్రామసభలే నిర్ణయించుకునేలా చేయడం ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యం అమలవుతోందని వాదిస్తున్నారు. ఇది గాంధీజీ ఆశించిన గ్రామ పంచాయతీ వ్యవస్థకు దగ్గరగా ఉందని వారు అంటున్నారు.

కొత్త ఉపాధి హామి బిల్లుతో గ్రామ పంచాయతీలకు మరింత అధికారం కల్పించబడుతుందని, రైతులకు అవసరమైన సమయంలో ఉపాధి హామి అమలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఉపాధి లేని కాలంలోనే పనులు కల్పించడం వల్ల రైతులకు, కూలీలకు రెండింటికీ మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నిలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతుందన్న భయంతోనే కాంగ్రెస్ వ్యతిరేకత చూపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్ విధానం, ఫేక్ జాబ్ కార్డుల నియంత్రణ, గ్రామ పంచాయతీలకు అధికారం వంటి అంశాలపై కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెబుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మొత్తంగా చూస్తే కొత్త ఉపాధి హామి బిల్ గ్రామీణాభివృద్ధికి కీలకమని, రాజకీయాలకు అతీతంగా దీనిపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల మేలు కోసమే తీసుకొచ్చిన ఈ సంస్కరణలు సక్రమంగా అమలైతే గ్రామీణ భారత ముఖచిత్రం మారే అవకాశం ఉందని అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *