నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు నిధులు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్

నిజామాబాద్ జిల్లా సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ మాట్లాడుతూ, నిజాంసాగర్ కాల్వల పునరుద్ధరణ, ఆధునీకరణకు తక్షణమే నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి సమక్షంలో ఆయన మాట్లాడుతూ, ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన 22 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, లంబాడీ తండాల పరిధిలోని నిజాంసాగర్ కాల్వ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సుమారు 7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

ఇంకా, 2016 నుంచి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటార్లు కాలిపోయి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు వాటి రీప్లేస్‌మెంట్ జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఇవేమీ లక్షల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు కాదని, చిన్న పనులే అయినప్పటికీ ఏళ్ల తరబడి నిర్లక్ష్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై నీటి పారుదల శాఖ మంత్రిని సుమారు 20 సార్లు కలిసినప్పటికీ, సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని అన్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్ట్ స్వాతంత్ర్యానికి ముందే నిర్మితమైనదని, ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాకు ప్రాణాధారంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, సగం ప్రాజెక్ట్ పనికిరాని పరిస్థితిలో ఉందని చెప్పారు.

గత ప్రభుత్వం సుమారు 89 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 21 వేల కోట్లతో ప్రారంభించి వ్యయం 56 వేల కోట్లకు చేరిందని గుర్తు చేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా మారిన తర్వాత కూడా అత్యధికంగా నష్టపోయిన జిల్లా నిజామాబాద్ ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు.

నిజాంసాగర్ కాల్వల పునరుద్ధరణ, లైనింగ్, ఆధునీకరణకు కనీసం 2,000 కోట్ల నిధులు అవసరమని, అందులో ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మదనపల్లి నుంచి పత్తేటప్పటి వరకు కాల్వల ఆధునీకరణకు సుమారు 1,500 కోట్లను ప్రత్యేకంగా కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. దక్షిణ తెలంగాణ జిల్లాలకు భారీ ప్రాజెక్టులు చేపడుతున్న ప్రభుత్వం, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి 2024 జనవరిలో మంత్రి సంతకం చేసిన ఫైల్ ఇప్పటికీ ముందుకు కదలలేదని ఎమ్మెల్యే తెలిపారు. వేల కోట్ల నిధులు అడగడం లేదని, కానీ వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ ఉపాధి, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లాను నిర్లక్ష్యం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి స్పందిస్తూ, ఎమ్మెల్యే రాకేష్ లేవనెత్తిన అంశాలను జాగ్రత్తగా నోట్ చేసుకున్నామని తెలిపారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వారం రోజుల్లో ముఖ్యమంత్రి సహా తాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లి సదర్మట్ బ్యారేజ్ ప్రారంభోత్సవం, చనాక–కొరట ప్రాజెక్ట్ పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే చనాక–కొరట ప్రాజెక్ట్ కోసం 70 కోట్లను జిల్లా కలెక్టర్ పీడీ ఖాతాకు విడుదల చేసినట్లు వెల్లడించారు.

చనాక–కొరట ప్రాజెక్ట్ విషయంలో ఎంత నిధులు అవసరమైనా విడుదల చేస్తామని, ఇది శాఖకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ అని మంత్రి సభాముఖంగా హామీ ఇచ్చారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన ప్యాకేజ్–28కు సంబంధించిన 50 వేల ఎకరాల ప్రాజెక్ట్‌ను కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రస్తావించిన నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణ అంశంపై శాసనసభ ముగిసిన వెంటనే అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి, బెనిఫిట్–కాస్ట్ రేషియో, నీటి లభ్యత వంటి అంశాలు పరిశీలించి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఈ పనులను ముందుకు తీసుకెళ్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అవసరమైన నిధుల కేటాయింపుపై కూడా సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *