తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళికి ప్రత్యేక స్థానం ఉంది. శాంతి నివాసం సీరియల్ నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు ఆయన చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఓ బ్రాండ్‌లా మారింది. రాజమౌళి సినిమా అంటే రిజల్ట్‌పై ఎలాంటి సందేహం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే స్థాయిని జక్కన్న సృష్టించారు. ఓటమి ఎరుగని దర్శకుడిగా ఆయన వేసిన ప్రతి అడుగు తెలుగు సినిమా గౌరవాన్ని పెంచింది.
అదే తరహాలో హీరోల విభాగంలో నేడు న్యాచురల్ స్టార్ నాని కూడా అలాంటి స్థిరత్వాన్ని చూపిస్తున్నాడన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. నాని పేరు వినిపిస్తే సినిమా కంటెంట్‌పై ఒక నమ్మకం ఏర్పడేలా ఆయన తన కెరీర్‌ను మలచుకున్నారు.
నాని కెరీర్ ఆరంభం నుంచి కొత్త దర్శకులతో కలిసి ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగాడు. మధ్యలో కొంత డౌన్ ఫేజ్ వచ్చినా, తనను తాను రీడిజైన్ చేసుకొని మంచి కథల వైపు మళ్లాడు. కొత్త దర్శకుల వద్ద ఉన్న ఫ్రెష్ కంటెంట్‌ను నమ్మిన నాని, వారితో సినిమాలు చేసి తన గ్రాఫ్‌ను మళ్లీ పైకి తీసుకెళ్లాడు.
ఇటీవల వరుస విజయాలతో నాని తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నాని సినిమా అంటే కథ ఓకే అయిన దగ్గర నుంచి రిలీజ్ వరకు ప్రతిదీ పక్కా ప్లానింగ్‌తో సాగుతుంది. కథ, స్క్రీన్‌ప్లే, ప్రమోషన్స్, రిలీజ్ టైమింగ్ వరకు అన్ని అంశాల్లో డైరెక్టర్‌తో కలిసి నాని కీలక పాత్ర పోషిస్తాడని ఇండస్ట్రీలో టాక్. అందుకే ఆయన సక్సెస్ రేటు ఈ స్థాయిలో ఉందని చెప్పాలి.
రాజమౌళి తన సినిమాల కోసం కుటుంబంతో కలిసి డే అండ్ నైట్ కష్టపడుతూ బెస్ట్ అవుట్‌పుట్ తీసుకొస్తే, అదే తరహాలో నాని కూడా తనకు నచ్చిన కథను సూపర్ హిట్ చేయడానికి అన్నీ తానై చూసుకుంటాడన్నది అభిమానుల అభిప్రాయం. మిగతా హీరోలకు ఒక్క హిట్ రావడమే పెద్ద ఛాలెంజ్‌గా మారిన ఈ రోజుల్లో, నాని మాత్రం పర్ఫెక్ట్ స్కెచ్‌తో సినిమాలు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.
ఒకప్పుడు క్లాస్ హీరో అనే ఇమేజ్‌తో ఉన్న నాని, దసరా సినిమాతో తన మాస్ టర్న్ చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఆయన నుంచి రాబోయే ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెలతో మరోసారి నాని మాస్ బ్లాస్ట్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కూడా లాక్ కావడం నాని కెరీర్ గ్రాఫ్ మరింత ఎగబాకుతుందన్న సంకేతంగా కనిపిస్తోంది.
ఇలా దర్శకుల్లో రాజమౌళి ఎలా ఒక బ్రాండ్‌గా మారాడో, హీరోల్లో నాని కూడా అదే స్థాయి నమ్మకాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడన్నది టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

