ఆడంబర రాజకీయాలు వద్దు… నిజాయితీకి ఓటేయండి: కామారెడ్డి ప్రజలకు రమణ రెడ్డి పిలుపు

కామారెడ్డి ప్రజలు విజ్ఞులని, ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ చేసినా తనను గెలిపించిన ప్రజల తీర్పు ప్రత్యేకమని రమణ రెడ్డి అన్నారు. తాను గెలిచే ముందు ఎలా సాధారణంగా వచ్చానో, గెలిచిన తర్వాత కూడా అలాగే సాధారణ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపారు.

భారీ కాన్వాయ్‌లు, ఫ్లెక్సీలు, ఆడంబర కార్యక్రమాలు పెట్టుకోవడం నాయకత్వానికి గుర్తు కాదని స్పష్టం చేశారు. ప్రజల డబ్బుతో ప్రదర్శనలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని విమర్శించారు. పెద్ద ఎత్తున వాహనాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి ఖర్చు చేసే డబ్బు చివరికి ప్రజల నుంచే వస్తుందని అన్నారు.

మున్సిపల్ వ్యవస్థలో కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ, వాటి వినియోగం, అభివృద్ధి గురించి చాలా మందికి సరైన అవగాహన లేదని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, వ్యక్తులకంటే నిజాయితీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

తాను గెలిచినా ఓడినా తన వ్యక్తిత్వం, నిజాయితీ మారదని చెప్పారు. ఎమ్మెల్యే పదవి తాత్కాలికమైనదే కానీ తన నడవడి శాశ్వతమని స్పష్టం చేశారు. ప్రజల డబ్బు ప్రజలకే ఉపయోగపడేలా ఉండాలంటే బాధ్యతగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కామారెడ్డి అభివృద్ధి, మార్పు కోసం ప్రజలు చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *