ఫ్యూచర్ సిటీని అడ్డుకునేవాళ్లు రద్దయిపోయిన వెయ్యి నోట్ల లాంటివాళ్లు’.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

‘ఫ్యూచర్ సిటీని అడ్డుకునేవాళ్లు రద్దయిపోయిన వెయ్యి నోట్ల లాంటివాళ్లు’.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్ నగర చరిత్ర, అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే శక్తులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉందని, కులీ కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు నగరాన్ని విస్తరించడంతో ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని సీఎం పేర్కొన్నారు. సికింద్రాబాద్ అభివృద్ధి కారణంగా జంట నగరాలు ఏర్పడ్డాయని, అనంతరం సైబరాబాద్ రూపకల్పన తెలంగాణ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిందని చెప్పారు.

“ఈరోజు రాష్ట్ర ఆదాయంలో 60 శాతం సైబరాబాద్ ప్రాంతం నుంచే వస్తోంది. రంగారెడ్డి జిల్లా భూముల విలువ బంగారాన్ని మించిపోయింది. ఇది దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల ఫలితం” అని సీఎం అన్నారు.

1908లో వచ్చిన వరదల అనంతరం నిజాం ప్రభుత్వం గండిపేట, హిమాయత్ సాగర్ నిర్మించిందని, మూసీ నది ప్రవాహాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. అదే దూరదృష్టి వల్లే హైదరాబాద్ ఈరోజు గొప్ప నగరంగా ఎదిగిందని చెప్పారు.

స్వాతంత్ర్యం తర్వాత హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, జీనోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులను కూడా అప్పట్లో చాలామంది వ్యతిరేకించారని సీఎం గుర్తుచేశారు.

“హైటెక్ సిటీ వద్దన్నారు… ఔటర్ రింగ్ రోడ్ అడ్డుకున్నారు… ఎయిర్‌పోర్ట్ అవసరం లేదన్నారు… ఐటీ కంపెనీలు వద్దన్నారు. కానీ ఆ ప్రాజెక్టుల వల్లే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు వచ్చాయి” అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“రామాయణంలో రావణాసురుడు, మారీచుడు, సుబాహుడు ఉన్నట్టే అభివృద్ధిని అడ్డుకునే శక్తులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొందరు చెబుతున్నారు. వాళ్లు రద్దయిపోయిన వెయ్యి నోట్ల లాంటివాళ్లు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే వారిని తిరస్కరించారు” అని అన్నారు.

ఫ్యూచర్ సిటీ కేవలం ప్రస్తుత తరానికి మాత్రమే కాకుండా రాబోయే తరాల భవిష్యత్తు కోసం రూపొందిస్తున్న ప్రాజెక్ట్ అని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు తీసుకువచ్చే కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.

డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీ పనులు ప్రారంభించామని, కేవలం 150 రోజుల్లోనే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.

“2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుంది. టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీ పడే స్థాయిలో ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను వేగంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ యువత భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచే నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *