ఉస్మానియా యూనివర్శిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముందుగా విద్యార్థుల అరెస్టులు, కాల్స్, ఇంటి దగ్గర విజిలెన్స్ పెరగడం వంటివి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను వినిపించడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు ముందుగానే అడ్డుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి.
విద్యార్థి నాయకురాలు ఆస్మా మరోసారి అక్రమ అరెస్టుల బెడదను ఎదుర్కొంటుండగా, ఆమె ఇంటికి పోలీసులు వెళ్లి “స్టేషన్‌కి రండి” అంటూ ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఆమెను స్ట్రీట్‌లో తీసుకెళ్లి అవమానకరంగా వ్యవహరించారని, FIRలు పెట్టారని ఆమె ఆరోపించింది.
ఇతర విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి వస్తే ముందుగానే నిరుద్యోగుల గొంతును మూయడానికి ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు లేకపోవడం, అవుట్సోర్సింగ్ స్టాఫ్‌తో తరగతులు సాగడం, మెస్–ఫీజు పెంపులు, రీయింబర్స్‌మెంట్ ఆలస్యం, ఖాళీ టీచింగ్ పోస్టులపై ప్రభుత్వం స్పందించకపోవడం వంటి సమస్యలను వినతిపత్రంగా ఇవ్వాలని నిరుద్యోగులు భావించారు. అయితే ఆ అవకాశం ఇవ్వకుండానే అరెస్టులు చేయడం తప్పని తీవ్రంగా చెబుతున్నారు.
ఎవరూ అడ్డుకోరని, ఒక్క పోలీసు కూడా ఉండరని సీఎం మాట ఇచ్చినా, ఈరోజు ఓయూ మొత్తం పోలీసులతో నిండిపోయింది. స్టూడెంట్స్ కంటే పోలీసులు ఎక్కువ” అని విద్యార్థులు విమర్శిస్తున్నారు.
అలాగే నిరుద్యోగులు రెండు సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక ఉద్యోగ అవకాశాలు నిలిచిపోయాయని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, బకాయి నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
“రెవంత్ గారి పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఉద్యోగాలు ఇవ్వాలి, యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. స్టూడెంట్ సమస్యలు వినడానికి విద్యాశాఖ మంత్రి కూడా ఎప్పుడూ కనిపించడం లేదు” అని విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఓయూలో పోలీసులు భారీగా మొహరించడం, ముందస్తు అరెస్టులు చేయడం, నిరుద్యోగులపై “టెర్రరిస్టుల్లా” ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్టూడెంట్స్, యువజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

