తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలల తరబడి కొనసాగుతున్న అనిశ్చితి నేడు కొంతవరకు చెదరనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.
ఇప్పటికే గ్రామీణ పాలక వర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు దాటిపోయింది. సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ పదవులు ఖాళీ అయినా పల్లెల్లో పూర్తి స్థాయి పరిపాలన నిలిచిపోయిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణను ఇక మించిన ఆలస్యం చేయలేమన్న భావన ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది.
బీసీ రిజర్వేషన్లే ప్రధాన అడ్డంకి
ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని భావించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు స్పష్టంగా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ అమలు చేయలేమని తీర్పు ఇచ్చింది. సుప్రీంలోనూ ఇదే దిశలో వ్యాఖ్యలు రావడంతో 42% రిజర్వేషన్ సాధ్యం కాకపోయే పరిస్థితి ఏర్పడింది.
దీంతో ప్రభుత్వం చట్టబద్ధంగా 50% రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తూ, పార్టీ పరంగా 42% సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే దీన్ని బీసీ సంఘాలు పూర్తిగా తిరస్కరించాయి.
బీసీ సంఘాల వాదన స్పష్టం —
పార్టీ పరంగా కాదు, చట్టబద్ధంగా జీవో ద్వారా 42% రిజర్వేషన్ కావాలి. నైన్‌థ్ షెడ్యూల్‌లో పెట్టాలి.”
కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నైన్‌థ్ షెడ్యూల్‌లో చేర్చడం సాధ్యంకాదని ఇప్పటికే తెలుపడంతో ప్రభుత్వానికి చిక్కుముడి మరింత గట్టిగా మారింది.
హైకోర్ట్ డెడ్‌లైన్ – నవంబర్ 24
హైకోర్టు ఈ కేసును నవంబర్ 24న విచారించనుంది. అప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్‌పై, రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తన తుది నిర్ణయం చెప్పాల్సిందే. ఈ ఒత్తిడి నేడు క్యాబినెట్ తీసుకోబోయే నిర్ణయంపై స్పష్టంగా ప్రభావం చూపనుంది.
పల్లెల్లో ప్రజాభిప్రాయం ఏంటి?
సర్కార్ ప్రజాపాలన అద్భుతమని భావిస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాన్ని ఆధారంగా తీసుకుంటోంది. కాని పల్లెల్లో మాత్రం వేరే వాతావరణం కనిపిస్తోంది.
రైతు రుణ మాఫీ, బోనస్, పంట కొనుగోళ్లు, పెన్షన్లు, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ నియామకాల ఆలస్యం, ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు… ఇలా అనేక అంశాలు పల్లెల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని విమర్శలు ఉన్నాయి.
సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500 సిలిండర్ వాగ్దానాలు ఎంతవరకు అమలయ్యాయి? అనే ప్రశ్న పల్లెల్లో పౌరుల మధ్య పెద్దగా వినిపిస్తోంది.
విజయోత్సవాల కన్నా ఎన్నికలు ముఖ్యమేనా?
డిసెంబర్ 1 నుంచి 8 వరకు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు,
డిసెంబర్ 9నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి.
కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఈ కార్యక్రమాలకు ఇబ్బంది కలగొచ్చనే కారణంతో ప్రభుత్వం డిసెంబర్ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోందని సమాచారం.
క్యాబినెట్లో చర్చకు వచ్చే ఇతర అంశాలు
- గీగ్ వర్కర్ల బిల్లు
- రెండు సంవత్సరాల పాలనా కార్యక్రమాలు
- గ్లోబల్ సమ్మిట్ వేదిక నిర్ణయం
- కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలు
- ముఖ్య అభివృద్ధి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- కవి అందశ్రీ కుటుంబానికి సదుపాయాల ఆమోదం
- బీసీల ఆగ్రహం పెరుగుతోంది
- బీసీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి —
- “పార్టీ పరంగా ఇచ్చే 42% మా కోసం కాదు. మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు కావాలి.”
- నిన్న కూడా జరిగిన సమావేశంలో బీసీ సంఘాలు విజయోత్సవాలు, సమ్మిట్ల కన్నా తమ రిజర్వేషన్ల సమస్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశాయి.
- ప్రధాన ప్రశ్నలు ఇప్పుడు ఇవే—
- నేడు క్యాబినెట్ 50% రిజర్వేషన్‌తోనే ముందుకు వెళ్తుందా?
- పార్టీ పరంగా 42% కేటాయింపు బీసీలను సంతృప్తిపరుస్తుందా?
- నోటిఫికేషన్ డిసెంబర్ తర్వాతకే వాయిదా పడుతుందా?
- ఎన్నికలు పెట్టే నిర్ణయం తీసుకుంటే మళ్లీ కోర్టు కేసులు వస్తాయా?
తెలంగాణ రాజకీయ వర్గాలంతా నేడు జరిగే క్యాబినెట్ నిర్ణయాలపై కళ్లప్పగించి ఎదురు చూస్తున్నాయి.

