బీజేపీ నేత మరియు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ఇటీవల చేసిన “హిందువుల ఓట్లతోనే బీజేపీ కేంద్రంలోకి వస్తుంది” అనే వ్యాఖ్య దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి కారణమైంది. ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న నాయకుడు మతాల పేరుతో ప్రజలను విభజించడం ఎంత ప్రమాదకరో రాజకీయ వర్గాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వేసే ప్రతీ పౌరుని ఓటు సమానమే. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఏ మతానికి చెందిన ఓటు అయినా ప్రజాస్వామ్య విలువల్లో తేడా ఉండదు. అయితే ఇటీవలి కాలంలో బీజెపి తరఫున వస్తున్న వ్యాఖ్యలు సమాజంలో అసలు లేని విభజనలను సృష్టించే దిశగా వెళ్తున్నాయని విమర్శకులు అంటున్నారు.
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక సమయంలో సంజయ్ చేసిన ప్రకటనలు — “అక్కడ రెండు లక్షల హిందూ ఓట్లు ఉన్నాయ్… అవి చాలు” అన్న వాఖ్య — ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా తిరుగుతున్నాయి. కానీ ఫలితాల్లో బీజేపీ డిపాజిట్ కూడా నిలుపుకోలేకపోవడం ప్రజలు మతాల కంటే అభివృద్ధిని, నాయకత్వ లక్షణాలను ప్రాధాన్యంగా చూస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించింది.
అదే సమయంలో ‘జై శ్రీరామ్’ నినాదాన్ని రాజకీయాలకు ముడిపెడుతూ భక్తిని ఓటు బ్యాంకుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. “భక్తి వ్యక్తిగతం… దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్పు” అనే అభిప్రాయం మరింత బలపడుతోంది.
ఇక మతపరమైన రక్షణ పేరుతో బీజేపీ ఎన్నో హామీలు ఇవ్వడంతో పాటు, ముఖ్యంగా హైదరాబాదు బంజారాహిల్స్ ముత్యాలమ్మ గుడి వివాదంలో ఇచ్చిన 200 గజాల స్థల హామీ ఇప్పటికీ నెరవేరలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విగ్రహాన్ని ఫిల్మ్‌నగర్ ఆలయానికి తరలించడం తప్ప, గుడిని రక్షించడంలో బీజేపీ వైఫల్యం స్పష్టమైందని భక్తులు విమర్శిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ లాంటి నేతల వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతున్నాయనే అభిప్రాయం బహిరంగంగా వ్యక్తమవుతోంది. వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు అసలు హిందుత్వాన్ని అభివృద్ధి పేరుతో ముందుకు తీసుకువస్తుందా? లేక మతాలను విభజించే వ్యూహానికే పరిమితమైందా? అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.
ఇక మరోవైపు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టసవరణలపై సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తావనీయమే. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టంపై కోర్టు కీలక నిబంధనలను రద్దు చేయడం, “పాత చట్టాన్ని చిన్న మార్పులు చేసి మళ్లీ ప్రవేశపెట్టడం కోర్టు తీర్పులను పక్కన పెట్టడమే” అని వ్యాఖ్యానించడం కేంద్రానికి మరొక జోల్టుగా మారింది.
మొత్తంగా, ప్రజల్లో అసలు లేని మత విభజనను రాజకీయాల కోసం సృష్టించడం వల్ల దేశానికి ఉపయోగం ఏమీలేదని, నాయకులు ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత గుర్తించుకోవాలని పౌరులు బలంగా చెబుతున్నారు.

